టేకులపల్లి, జనవరి 06 : షీ టీమ్స్‌పై మంగళవారం టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ ఎస్ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమన్నారు. పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేదనకు గురికాకూడదని, మంచి ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలన్నారు. క్రమశిక్షణతో ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు ఏఎస్ఐ నాగయ్య, కానిస్టేబుల్ రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం మంగీలాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.