– ప్రభుత్వం ప్రతీ నెల రూ.12 వేలు ఇవ్వాలి
– సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు భూక్య రమేశ్
కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 01 : రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి ఆటో డ్రైవర్‌కి నెలకు రూ.12 వేల జీవన భృతి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు భూక్య రమేశ్ డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో ఆటో, ట్రాలీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. డ్రైవింగే జీవనాధారంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు సుమారు 4 వేలు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని, కిరాయిలు దొరకక ఆటోలు అమ్ముకుంటూ రోజు కూలికి పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఆటో కిరాయిలు లేక అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఈఎంఐలు కట్టాలని, ఆటో కిస్తీలు కట్టకపోతే ఫైనాన్స్ వ్యాపారస్తులు ఆటోలు గుంజుకపోతున్నారని, వారి వేధింపులు అరికట్టాలన్నారు.
దీనంతటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన విమర్శించారు. మోటార్ ఫీల్డ్ కి అలవాటు పడ్డ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, డ్రైవింగ్ చేసే వారందరికీ సరైన ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రోడ్డుపై ప్రజలు ఆటో ఎక్కుతున్న సందర్భంలో పోలీసులు ఫొటోలు తీసి అదనపు చలానాలు వేస్తున్నారని దాంతో ఆటో డ్రైవర్ల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఫొటోలు కొట్టే పద్ధతి రద్దు చేయాలని కోరారు. స్థానిక ఆటో అడ్డాలలో వస్తున్న ఆటో డ్రైవర్ల సమస్యలపై ట్రాఫిక్ పోలీసు వారు విధిస్తున్న ఆంక్షలు సడలించాలన్నారు. కొత్తగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో దశల వారి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలో సీఐటీయూ జిల్లా నాయకులు లిక్కి బాలరాజు, రామకోటి, సయ్యద్, నరసింహారావు, శివ పాల్గొన్నారు.
కొత్తగూడెం పట్టణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సీఐటీయూ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నునావత్ రామకోటి, కార్యదర్శిగా సయ్యద్, కమిటీ సభ్యులుగా రాంబాబు, శివ, గణేష్, నరసింహ, పాషా, ముజాహిద్, ప్రేమ్ కుమార్, రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.