ఇల్లెందు, మే 28 : అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో చోటుచేసుకుంది. ఇల్లెందు పట్టణం 14 నంబర్ బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ దుర్గాప్రసాద్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల ఆటోకి సరిగా కిరాయిలు దొరక్క ఫైనాన్స్ పెరిగి, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపం చెంది మంగళవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మృతదేహంతో ఇల్లెందు గవర్నమెంట్ హాస్పటల్ నుండి ర్యాలీగా ఆటో డ్రైవర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు మల్లేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు అప్పుల బాధతో మరణిస్తున్నట్లు తెలిపాడు. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబంతో పాటు ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని నిరసన తెలిపారు.