– ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయాలు
బూర్గంపహాడ్, మే 23 : వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనగా ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని కోయగూడెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెంకు చెందిన ఆడెపు సతీష్ తన భార్య స్వప్న, కుమారుడు మనోహర్‌తో కలిసి అదే మండలం చిరుమళ్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఆటోలో భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్తున్నారు. ఆటో మండల పరిధిలోని కోయగూడెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పడంతో ఆటోను డ్రైవర్ రహదారికి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సతీష్, స్వప్న, మనోహర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో స్థానికులు హుటాహుటీన వారిని అంబులెన్స్‌లో భద్రాచలం తరలించగా సతీష్, స్వప్నలకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. మనోహర్ పరిస్థితి విషమించడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఇదిలా ఉండగా సతీశ్‌కు ఏడాది క్రితం తలకు శస్త్ర చికిత్స చేసి చిప్పను అమర్చారు. తలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుని మరోసారి తలకు గాయాలయ్యాయి. అంతేకాకుండా తనతో పాటు ఆస్పత్రికి వస్తున్న తన భార్య, కుమారుడు ప్రమాదం భారిన పడడం శోచనీయం.