చుంచుపల్లి, మే 22 : చుంచుపల్లి మండలంలోని త్రీ ఇంక్లైన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గీతం ప్రవళిక భర్త రాజీవ్ గాంధీపై శుక్రవారం రాత్రి దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచ్ గెలుపునకు కృషి చేసిన బొల్లి కార్తీక్‌పై అదే పంచాయతీకి చెందిన కట్ట శ్రీనివాస్, నేరేడుమల్లి నవదీప్ ఈ ఏడాది మార్చి 20న దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో బొల్లి కార్తీక్ ముక్కు ఎముక విరిగినట్లు తెలిసింది. బాధితుడు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఏప్రిల్ 21న వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులైన శ్రీనివాస్, నవదీప్‌లను గురువారం పోలీసులు రిమాండ్‌కు పంపించారు.
అయితే తమ కుమారుడు జైలుకు వెళ్లడానికి సర్పంచ్ భర్త రాజీవ్ గాంధీ కారణమని భావించిన నేరేడుమల్లి నవదీప్ తండ్రి సునీల్, గురువారం రాత్రి రాజీవ్ గాంధీపై కూల్‌డ్రింక్ సీసాలు, రాళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో రాజీవ్ గాంధీ తలకు రెండు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు కుట్లు పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాడి ఘటనపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, అలాగే డీఎస్పీ ఆదినారాయణకు కూడా వినతి అందించినట్లు వారు పేర్కొన్నారు.