రుద్రంపూర్, జూన్ 04 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) గనుల భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రెస్క్యూ అండ్ రికవరీ వర్క్స్ (Rescue and Recovery Works) శిక్షణ కోసం అర్హులైన ఉద్యోగుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు మైన్స్ రెస్క్యూ సర్వీసెస్ జనరల్ మేనేజర్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ (OSH&WC) సెంట్రల్ రూల్స్-2026లోని నిబంధనల ప్రకారం గనుల్లో శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, కనీసం పదో తరగతి విద్యార్హతతో పాటు భూగర్భ గనుల్లో తగిన అనుభవం ఉండాలని సూచించారు.
దరఖాస్తుదారులకు ఎంపిక పరీక్ష, వైద్య పరీక్ష నిర్వహించనుండగా, అర్హత సాధించిన వారికి రామగుండం మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ప్రారంభ శిక్షణ అందజేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన ఉద్యోగులను ప్రోత్సహించి, నిర్దేశిత దరఖాస్తు ఫారమ్‌లను పూర్తి చేసి 15 జూన్, 2026లోపు పంపించాలని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, ఏజెంట్లు, కాలరీస్ మేనేజర్లు , సంబంధిత అధికారులకు సూచించారు. ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు జనరల్ మేనేజర్ రెస్క్యూ సర్వీసెస్ అధికారులు తెలిపారు.