చుంచుపల్లి, నవంబర్ 24 : తమను నిర్ధాక్షణ్యంగా విధుల నుండి తీసేస్తున్నారని, దీంతో తమ కుటుంబాలు వీధిన పడతాయంటూ చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రంపూర్ పంచాయతీలో 13 మంది పారిశుధ్య కార్మికులను సోమవారం నుండి విధులకు రాకూడదని సెక్రటరీ తెలపడంతో పంచాయతీ వర్కర్లకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అని అడుగగా తమ పేర్లు ఈ పంచాయతీ పోర్టల్ నమోదు కాలేదని, దీని కారణంగా విధులకు తీసుకోవడం లేదని సెక్రటరీ తెలిపినట్లు వారు వెల్లడించారు. రుద్రంపూర్ పంచాయతీలో 2020 సంవత్సరం నుండి 13 మంది మల్టీపర్సప్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నామని. గతంలో పని చేసిన పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పంచాయితీలో నమోదు చేయలేదన్నారు. ఈ నెల 22 వరకు విధులు నిర్వహించినట్లు, కానీ ఈ పోర్టల్ లో నమోదు కాకపోవడం వల్ల జీతాలు చెల్లింపులో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ కార్యదర్శి తమ పేర్లు ఈ పోర్టల్ లో లేని కారణంగా సోమవారం నుండి జీతాలు రావని, విధులకు రావద్దని తెలిపారన్నారు. దీంతో తమ కుంటుంబాలు రోడ్డున పడ్డట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ని సంవత్సరాలుగా పంచాయతీలో పారిశుధ్య పనులు, ఇతర పనులను నిర్వహించినట్లు, అప్పటి అధికారుల తప్పిదాల వల్ల నేడు తాము మూల్యం చెల్లించుకోవాల్సిం వస్తోందన్నారు. తమ పేర్లు పంచాయతీ ఈ పోర్టల్లో లో నమోదు అయ్యేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. జీఓ నంబరు 51ను అనుసరించి జనాభా ప్రాతిపదికన 500 మందికి 1 పారిశుధ్య కార్మికుడిని నియమించాలని, 2011 జనాభా లెక్కలను అనుసరించి రుద్రంపూర్ పంచాయతీలో 3,578 మంది జనాభా ఉందన్నారు. దీని ప్రకారం పంచాయతీలో 17 మంది పారిశుధ్య కార్మికులను నియమించాల్సి ఉన్నట్లు చెప్పారు. కానీ పంచాయతీ ఈ పోర్టల్లో లో కేవలం ఐదుగురి పేర్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న 13 మంది 2020 సంవత్సవరం నుండి పని చేస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన పొరపాటును పంచాయతీ రాజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఆన్లైన్కు అవకాశం కల్పించాల్సిందిగా వారు వేడుకుంటున్నారు.