రుద్రంపూర్, ఆగస్టు 31 : సింగరేణి సంస్థలో అధికారులు (ఎగ్జిక్యూటివ్‌లు), ఉద్యోగులు(ఎన్సీడబ్ల్యూఏ) ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ (పీఎంఈ) నిర్వహించాలని కార్పొరేట్ సేఫ్టీ విభాగం జారీ చేసిన తాజా సర్క్యులర్ కార్మికుల్లో భయాందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు గతంలో రెండున్నర సంవత్సరాలకు ఒకసారి, 45 సంవత్సరాలు లోపు ఉన్నవారికి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఎంఈ నిర్వహించే విధానం ఉండగా, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు కార్పొరేట్ సేఫ్టీ విభాగం ఆగస్టు 28, 2026న అన్ని ఏరియా జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జీఎంలు, హెచ్వోడీలకు సర్క్యులర్ జారీ చేసింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొంతమంది ఉద్యోగులు పీఎంఈలకు హాజరు కాలేదని పేర్కొన్న అధికారులు, ఓ ఎస్ హెచ్ ఓ ఎస్ హెచ్& డబ్ల్యూ సి సెంట్రల్ నిబంధన ప్రకారం-2026 లోని రూల్ 60 ప్రకారం ప్రతి ఉద్యోగి సంవత్సరానికి ఒకసారి పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. దీంతో తమ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి వైద్య పరీక్షల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే ఉద్యోగ భద్రత, విధుల నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వయోభారం పెరుగుతున్న ఉద్యోగుల్లో ఈ ఆందోళన మరింత కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలు స్పందించి పీఎంఈ విధానం వల్ల కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు. సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించడం వెనుక ఉన్న నిబంధనలు, పరీక్షల విధానం, ఆరోగ్య సమస్యలు గుర్తించిన సందర్భంలో ఉద్యోగులపై పడే ప్రభావం వంటి అంశాలపై యాజమాన్యంతో చర్చించి కార్మికులకు స్పష్టమైన భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ పేరుతో చేపట్టే పీఎంఈ ప్రక్రియ ఉద్యోగుల్లో భయాందోళనలు కాకుండా భరోసాను నింపేలా ఉండాలని, ఈ అంశంపై గుర్తింపు సంఘాలు, ప్రాతినిధ్య సంఘాలు వెంటనే స్పందించాలని కార్మికులు కోరుతున్నారు.