రామవరం, జూన్ 16 : ది సింగరేణి టిప్పర్స్ అండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బూర్గుల అనిల్‌కుమార్ ఎన్నికయ్యారు. రాజకీయ జోక్యం, వివాదాలు అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారడంతో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రేత్యేక చొరవతో ఎట్టకేలకు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా నియమించబడిన ప్రభుత్వ సొసైటీ అధికారి పర్యవేక్షణలో పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హల్లో ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో తానంగి రవికుమార్‌పై అనిల్ కుమార్ 8 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 112 ఓట్లకు గాను 109 ఓట్లు పోలవగా ఒక ఓటు చెల్లలేదు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుమారుకు 58 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో నిలిచిన రవికుమారుకు 50 ఓట్లు పోలయ్యాయి. అనిల్ కుమార్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించి ధ్రువపత్రం అందజేశారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
సభ్యుల అందరి ఆమోదం, సమిష్టి నిర్ణయాలతో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిస్కారం కోసం కలిసికట్టుగా కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్కే సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం ”శేషగిరిభవన్’సలో అనిల్‌కుమార్, రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాజకీయ ప్రమేయం లేకుండా స్వయం ప్రతిపత్తితో అసోసియేషన్‌ను నడిపించాలని, ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి అవినీతికి తావ్వివ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యుడు గానగళ్ల వీరస్వామి, రుద్రంపూర్ సీపీఐ శాఖ కార్యదర్శి తోట రాజు పాల్గొన్నారు.