– పీవీకే–5లో జరిగిన సంభాషణకు ఆర్ఎల్సీ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్లకు సంబంధం లేదు
– ఏఐటీయూసీ
రుద్రంపూర్, సెప్టెంబర్ 05 : సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల అంశాన్ని ఆర్ఎల్సీ సమక్షంలో యాజమాన్యంతో ఏఐటీయూసీ కుదుర్చుకున్న అగ్రిమెంట్లకు ముడిపెట్టి ఐఎన్టీయూసీ నాయకులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించడమేనని ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య అన్నారు. పీవీకే–5 గనిలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులపై జరిగిన సంభాషణకు, ఆర్ఎల్సీ సమక్షంలో యాజమాన్యంతో జరిగిన అగ్రిమెంట్లకు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. సింగరేణిలో అండర్‌గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్లను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా కన్వర్షన్ చేయించేందుకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందన్నారు. సర్ఫేస్ కన్వర్షన్లో సింగరేణి వ్యాప్తంగా సీనియారిటీ జాబితాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న యాజమాన్య నిబంధనను ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకించిందని తెలిపారు. పోరాటాల ఫలితంగా కొత్తగూడెం ఏరియాలో ఆ నిబంధనను రద్దు చేయించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందని పేర్కొన్నారు. సర్ఫేస్ టు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ కోసం జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టడంతో పాటు, జీఎం పర్సనల్, డైరెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించామని చెప్పారు. అండర్‌గ్రౌండ్ కార్మికులకు కన్వర్షన్లో ఎలాంటి అన్యాయం జరగకూడదన్నదే ఏఐటీయూసీ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు.
మరోవైపు మణుగూరు సర్ఫేస్ కార్మికులను కొత్తగూడెంకు బదిలీ చేయిస్తామంటూ కొందరు ఐఎన్టీయూసీ నాయకులు డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన వారు, సర్ఫేస్ టు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల భర్తీకి సర్క్యులర్ తెప్పించింది మీరుకాదా? అని ప్రశ్నించారు. దీనిపై ఐఎన్టీయూసీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సత్తుపల్లి సర్ఫేస్ టు సర్ఫేస్ కన్వర్షన్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఐఎన్టీయూసీ నాయకులు యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కార్మిక ప్రయోజనాల కోసం ఏఐటీయూసీ పోరాడి, ఆర్ఎల్సీ సమక్షంలో యాజమాన్యంతో పలు కీలక అగ్రిమెంట్లు సాధించిందన్నారు. ఆ అగ్రిమెంట్ల వివరాలను కార్మికులకు వివరిస్తూ పీవీకే–5లో గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తుంటే కొందరు ఐఎన్టీయూసీ కార్యకర్తలు గొడవలు సృష్టిస్తూ సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశాలకు ఆటంకం కలిగించకుండా, దుష్ప్రచారాన్ని మానుకోవాలని వారు హితవు పలికారు. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వీరస్వామి, జక్కుల గట్టయ్య స్పష్టం చేశారు. కార్యక్రమంలో సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి సుధాకర్, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, నాయకులు రాజేశ్వరరావు పాల్గొన్నారు.