కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 23 : క్రీస్తు చూపిన మార్గం సర్వమానవాళికి అనుసరణీయమని, పండుగలు ఐక్యత చిహ్నాలని జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి, డీపీఆర్వో శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం (టీవీపీఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆ సంఘం కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధించిన శాంతి, సహనం, ప్రేమ ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. పండుగలు దేశ ఐక్యతకు చిహ్నాలని, ప్రతి పండుగ దేశంలోని అన్ని మతాలు, కులాలు కలిసి చేసుకుంటూ ఐక్యతను చాటి చెప్తున్నాయని అన్నారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాసరావు, ఆనంద్, టీవీపీఎస్ అధ్యక్షుడు గుండపనేని సతీశ్, మేడీ ప్రవీణ్, జగ్గుదాస్, జి.రాము, సభ్యులు, కాటి నాగేశ్వరరావు, చాంద్‌పాషా, కళాబాబు రెడ్డి, గట్ల రమేశ్, శ్రీను, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఆర్చిడ్ కిడ్స్ పాఠశాలలో…
కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 23 : మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆర్చిడ్ కిడ్స్ పాఠశాలలో యేసుక్రీస్తు జనన ఇతివృత్తాన్ని తెలియజేసే విధంగా పశువుల పాక ఏర్పాటు చేశారు. చిన్నారులు దేవదూతలు, శాంతాక్లాజ్ వేషధారణతో ఆకట్టుకున్నారు. పాఠశాల డైరెక్టర్ డి.విద్యాసాగర్, ప్రిన్సిపాల్ ఎం.శ్రీదేవి, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.
సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో…
సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లోని ధన్బాద్లో ఉన్న సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రెవరెండ్ బాల యసుదా, బ్రదర్ జర్మియా, ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వీవీ జోష్, బ్రదర్ జోసెఫ్ పాల్గొని కేక్ కట్ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
శ్రీవిద్య స్కూల్లో…
లక్ష్మీదేవిపల్లి, డిసెంబర్ 23 : మండలంలోని శ్రీవిద్య విద్యాలయంలో సీఈవో చైతన్యకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా దైవభక్తి, సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు. చిన్నారుల వేషధారణలు అలరించాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తిలక్‌నగర్‌లో…
రామవరం, డిసెంబర్ 23 : మండలంలోని రుద్రంపూర్ పంచాయతీ తిలక్‌నగర్ చర్చిలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పాస్టర్లు, సంఘ పెద్దలు, రుద్రంపూర్ గ్రామస్తులకు స్వీట్లు పంచారు. సర్పంచ్ గుమ్మడి సాగర్, టీబీజీకేఎస్ 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, మదర్ థెరిస్సా సేవా సంస్థ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య, సూరిబాబు పాల్గొన్నారు.