– 6 జిల్లాల నుండి పాల్గొననున్న 151 మంది ప్రతినిధులు
– కార్మిక సమస్యలు, సింగరేణి భవిష్యత్ సుదీర్ఘ చర్చలు
రుద్రంపూర్, జూన్ 06 : సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సెంట్రల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7, 8 తేదీల్లో కొత్తగూడెంలోని ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశాలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల నుండి సుమారు 151 మంది యూనియన్ ప్రతినిధులు, నాయకులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, యాజమాన్యం, ప్రభుత్వాల విధానాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరగనున్నాయని వివరించారు. సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, బొగ్గు ఉత్పత్తి పెంపు, సంస్థ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరాటాలపై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ స్థాయి, ప్రతి మూడు నెలలకు ఒకసారి సీఎండీ స్థాయి నిర్మాణాత్మక సమావేశాలు గుర్తింపు సంఘంతో నిర్వహించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు.
పెండింగ్లో ఉన్న 11వ క్యాడర్ స్కీమ్ అమలు, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, ప్రతి నెలా మెడికల్ బోర్డు సమావేశాల నిర్వహణ, మారుపేర్ల సమస్య పరిష్కారం, పర్క్స్పై విధిస్తున్న ఆదాయపు పన్ను భారం తొలగింపు, ప్రతి కార్మికునికి 200 గజాల ఇంటి స్థలం కేటాయింపు, రూ.30 లక్షల వడ్డీలేని గృహ రుణం మంజూరు వంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా మైన్స్, డిపార్ట్మెంట్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, జెన్కో నుంచి రావాల్సిన రూ.53 వేల కోట్ల బకాయిలను తక్షణమే వసూలు చేయాలని సమావేశం డిమాండ్ చేయనుంది. కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై భవిష్యత్ పోరాటాలు, ఉద్యమాల రూపకల్పనపై రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చలు జరుగుతాయని తెలిపారు.
ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట మనుబోతుల కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, కార్మికులు, అభిమానులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు.