దమ్మపేట, జూలై 10 : దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది గోళ్ల భవాని కృష్ణ యాదవ్పై దమ్మపేట పోలీసులు సివిల్ వివాదంలో కేసు నమోదు చేసిన విషయంలో దమ్మపేట బార్ అసోసియేషన్ రెండు రోజులుగా విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారికి సంఘీభావంగా శుక్రవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ailu) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జలసూత్రం శివరామ్ ప్రసాద్, ఏడునూతల శ్రీనివాస రావు, సీనియర్ నాయకులు జక్కంపూడి నాగేశ్వరరావు, దమ్మపేట బార్ అసోసియేషన్ ను సందర్శించారు. న్యాయవాది భవాని కృష్ణ యాదవ్ నుండి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వివాదానికి కారణమైన దమ్మపేట రెవిన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 273 లోని భూమిని పరిశీలించారు. వివాదాస్పద భూమిలో గత 60 ఏళ్లకు పైగా సాగు చేస్తున్న రైతులు ఈ సందర్భంగా తమను వేదిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ బి.దానం కుటుంబ సభ్యులు అలాగే అనుచరుల ఆకృత్యాలను ఐలు బృందానికి వివరించారు.
రైతులు తమ భూమిలో వేసిన కొబ్బరి మొక్కలను దానం మనుషులు నరికి వేశారని వాపోయారు. బాదితుల్లో ఒకరైన గట్ల రామయ్య తన పట్టా భూమిని పోలీస్ స్టేషన్ క్వార్టర్లు నిర్మించడానికి ప్రభుత్వానికి ఇస్తే తనకు ప్రభుత్వమే ఇక్కడా 2.5 ఎకరాల భూమిని అసైన్మెంట్ చేసిందని అట్లాంటిది ఇప్పటి తాసీల్దార్ తన భూమిని దానం భూమిగా రిపోర్ట్ ఇవ్వడం ఏమి న్యాయమని ఐలు బృందానికి చెప్పి బాధ పడ్డారు. రైతుల నుండి వివరాలు సేకరించి నిజ నిర్ధారణ చేసిన ఐలు బృందం రైతులకు న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు చేయటమే కాకుండా రైతులకు అండగా ఉంటామని, తగిన న్యాయ సహాయం అందిస్తామని ఐలు నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సీనియర్ న్యాయవాది ఐలు నాయకుడు ఉడతనేని శ్రీనివాసరావు, దమ్మపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సతీష్ కుమార్, దర్గావాలి, అరుణ, దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు, వారితో పాటు సీపీఎం నాయకులు దొడ్డా లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాస్ రావు, సిపిఎం నాయకులు, కొలిక పోగు శ్రీనివాసరావు పాల్గొన్నారు.