ఇల్లెందు, అక్టోబర్ 30: వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరి కోతలను వాయిదా వేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సతీష్ అన్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో తడిచిన పంటలను గురువారం కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలో సందర్శించి ఆయన మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో పంటలకు ఎరువులు వేయొద్దని సూచించారు. ఆరబెట్టిన గింజలను టార్పాలిన్ కవర్ల కింద కప్పి ఉంచాలన్నారు. నల్లరేగడి నేలల్లో తేమ ఎక్కువ రోజులు నిలిచి పంటలు కుళ్లిపోయే ప్రమాదముందన్నారు.
వర్షం నీటిని త్వరగా బయటికి పంపించాలని సూచించారు. మండలంలో వరి పంటపై ప్రాథమికంగా ఆరు గ్రామాలలో 426 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. మిర్చి తోటలు 50 ఎకరాలలో నష్టం జరిగిందని ప్రాథమిక విచారణలో అంచనా వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.