– వర్షాల కోసం రైతన్నల ఎదురు చూపులు
దుమ్ముగూడెం, సెప్టెంబరు 04 : ఏజెన్సీ కోనసీమగా పేరున్న దుమ్ముగూడెం మండలంలో ఈ ఏడాది వరిపంట సాగు చేయడం రైతులకు కష్టంగా మారింది. మండలంలో పంటలు వేసినప్పటికీ వర్షాలు లేకపోవడంతో సాగునీరు కరువై పంటలు బీడుగా మారుతున్నాయి. మండలంలోని పైడాకుల మడుగులో చిన గుబ్బలమంగి ప్రాజెక్టు ఆయకట్టు కింద 2,550 ఎకరాల వరి సాగు ప్రతి ఏటా చేస్తుంటారు. వర్షాకాలంలో మూడుసార్లు నిండితే పంటలు పండుతాయి. కానీ ఈసారి ఎగువన చత్తీస్గఢ్ లో వర్షాలు లేకపోవడంతో నీరు రాలేదు. ఈ ఏడాది రైతులు నార్లు పోసి ఎదురు చూస్తున్నారు. అలాగే చిన నల్లబెల్లి చెరువు ఆయకట్టు 410 ఎకరాలు సాగులో ఉంది. కాగా ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో రైతులు నార్లు పోసి ఎదురు చూస్తున్నారు. ముందుగా కొంత వర్షం పడటంతో నాట్లు వేశారు.

తలాపునే గోదావరి, తాలిపేరు.. బీడు భూమిగా ఏజెన్సీ కోనసీమ
గుబ్బలమంగి ప్రాజెక్టు కింద 2,500 ఎకరాలు ఉండగా 500 ఎకరాలు మాత్రమే వరి సాగు చేశారు. నల్లబెల్లి చెరువు కింద 25 ఎకరాలు సాగు చేశారు. మిగతా భూమంతా బీడు భూములుగా మారాయి. తలాపునే తాలిపేరు కెనాల్ ఉంది. తూరుబాక వరకు తాలిపేరు కెనాల్ ద్వారా సాగునీరు వెళ్తుంది. కాని ఆ ప్రాంతంలో చెరువులు నింపడానికి ఉపయోగం లేదని రైతులు అంటున్నారు. గోదావరి పక్కన ఉన్నప్పటికీ తాలిపేరు గోదావరి నదులు ఉన్నప్పటికీ మాకు ఉపయోగం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో చిన్నగుబ్బలమంగి ప్రాజెక్టును ఆర్ఆర్ఆర్ పథకంలో పెట్టి అభివృద్ది చేశారు. అనంతరం దీని నిర్వహణ మరిచిపోవడంతో ఇప్పుడు నీరు లేక వెలవెలబోతుంది.
ఈ ఏడాది వరదలు లేకపోవడంతో ప్రాజెక్టులు నిండక పంట పొలాల దుక్కులు ఎండుతున్నాయి. పక్కనే తాలిపేరు కెనాల్ ఉన్నప్పటికీ మాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇటు గోదావరి ఉన్నా నీరు నిల్వ అవకాశం లేదు. దుమ్ముగూడెం పేరు చెప్పి గోదావరి నీటిని వేరే మండలాలకు, జిల్లాలకు తీసుకు పోతున్నరు కానీ మా మండలంకు ఉపయోగడం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని సాగునీరు అందించాలి.

తలాపునే గోదావరి, తాలిపేరు.. బీడు భూమిగా ఏజెన్సీ కోనసీమ