చుంచుపల్లి, అక్టోబర్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన సరుకులు నిల్వ ఉంచే గదిలో వంట కోసం నిల్వ ఉంచిన కర్రల్లో ఐదు అడుగుల నాగు పాము బుసలు కొడుతూ పైకి లేచింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన సిబ్బంది హెచ్ఎంకు విషయం చెప్పగా ఆయన వెంటనే ప్రాణధార ట్రస్ట్ అధ్యక్షుడు, మున్సిపల్ కార్పొరేషన్ స్నేక్ స్పెషలిస్ట్ సంతోష్ కు సమాచారం ఇచ్చారు. సంతోష్ వెంటనే అక్కడికి చేరుకుని పామును వెతికి పట్టుకుని సురక్షితంగా బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం చుంచుపల్లి పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సందేహాలను తీర్చుతూ పాములపై అవగాహన కల్పించారు. ఏజెన్సీ గడ్డ పాములకు అడ్డా అని ఏమరపాటుగా ఉండకూడదన్నారు. అవగాహన, పరిశుభ్రత ముఖ్యమని తెలిపారు. ఈ రోజు రామవరం, జిఆర్ బస్తి, సుజాతనగర్, శ్రీనగర్ కాలనీలో సైతం పాములు పట్టిన విషయాన్ని వివరించారు. కళాశాల ఆవరణలో పాముల వల్ల సమస్య తలెత్తిన ప్రతిసారి క్షణాల్లో స్పందించి సమస్య పరిష్కరిస్తున్న సంతోష్, కార్పొరేషన్ కమిషనర్ కు అధ్యాపకులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.