కొత్తగూడెం అర్బన్, జూన్ 24 : ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపి మాట్లాడారు. కేజీ సిరిపురం గ్రామ ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు, ముక్కు భాగాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, దేశ ద్రోహం కేసులు నమోదు చేసి భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రపంచ దేశాలు అంబేద్కర్ మేధస్సును కీర్తిస్తూ ప్రపంచ మేధావిగా గుర్తిస్తుంటే భారత్లో మాత్రం ఇటువంటి ఘటనలు జరగడం పరిపాటిగా మారిందన్నారు. బహుజన సమాజం ఇకనైనా సోయి తెచ్చుకుని అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేయకుండా మన ఓట్లు మనమే వేసుకుని రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వీరు నాయక్, అల్లకొండ శరత్, ధనుంజయ్, సోను, జైసింగ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.