భద్రాచలం, సెప్టెంబర్ 01 : చర్ల దుమ్ముగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో చేతికొచ్చిన పత్తి చేలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆదివాసీ మహిళలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలు ఇవ్వాలని కోరుతూ భద్రాచలం ఐటీడీఏ పీఓ ముందు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ పీఓ రాహుల్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి, కామ్రేడ్ గౌని నాగేశ్వరరావు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి, కామ్రేడ్ ముసలి సతీశ్ మాట్లాడుతూ.. చర్ల దుమ్ముగూడెం, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు సుమారు 30 సంవత్సరాలుగా గడ్డోరుగట్టు,మామిడిగూడెం లాంటి ప్రాంతాలలో వందలాది కుటుంబాలు భూములను సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. అట్టి భూములపై ఇప్పుడు వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పంటలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు చెప్పారు.
అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే రాత్రికి రాత్రి పంట చేలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం 1/70 యాక్ట్, పిసా యాక్ట్ వంటివి పేరుకు మాత్రమేనన్నారు. మహిళలపై కేసులను పెట్టిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలన్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ గురువారం చర్చలు జరుపుదామని, సమస్యను పరిష్కరిద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు సూర్యకాంతం, కొండపనేని సత్యనారాయణ, కాక చంద్రయ్య. మట్ట నరసింహారావు, కుంజ జోగారావు, మీడియం భద్రయ్య, సోడి రమణ, పొంది కమల, కనితి జయమ్మ, మడకం సుక్కమ్మ, సున్నం ఆదిలక్ష్మి, మీడియం రాధా పాల్గొన్నారు.