రామవరం, సెప్టెంబర్ 11 : తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈఓ ను వెంటనే నియమించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం సీఈఓ గా విధులు నిర్వహిస్తున్న అసదుల్లాను తొలగించి నెల గడిచిందని, అయినప్పటికీ ప్రభుత్వం నేటి వరకు నూతన సీఈఓను నియమించలేదన్నారు. దీని కారణంగా వక్ఫ్ బోర్డులో పాలన గాడి తప్పుతుందన్నారు.
వక్ఫ్ భూముల కబ్జాదారుల ఫిర్యాదులు, జీతభత్యాలు, పెన్షన్లు, ఇమాం, మౌజన్ ల గౌరవ వేతనాలు వంటి పలు పరిపాలనా అంశాలు స్తంభించి పోయినట్లు తెలిపారు. సీఈఓ లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వస్తున్న ఫిర్యాదుదారులు వెనుతిరిగి వెళ్లవలసి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వక్ఫ్ బోర్డు సీఈఓ గా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే వక్ఫ్ బోర్డ్ పాలన గాడిన పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.