ఇల్లెందు, ఆగస్టు 4: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని ఇల్లెందు పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొత్తగూడెం వైపు నుంచి ఇల్లెందు వెళ్తున్న మారుతి యూవీ 300 కారులో వారు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారిని అరెస్టు చేసి, కారు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేశారు.
నిందితులను మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన తేజావత్ శంకర్, తేజావత్ జంకు, సూర్యాపేట జిల్లాకు చెందని ఆంగోతు సంతులుగా పోలీసులు గుర్తించారు. ఒడిశాకు చెందిన రాము తాతారావు వద్ద గంజాయిని తీసుకుని మహారాష్టలోని హరిబాబుకు అప్పగించేందుకు వెళ్తున్నట్లుగా విచారణలో తెలుసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.22.68 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.