
హరితహారంలో సింగరేణి ముందంజ
11 ఏరియాల్లో నర్సరీల నిర్వహణ
ఈ ఏడాది 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు
ఇప్పటికే సగానికి పైగా లక్ష్యం పూర్తి
కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 22: సింగరేణి సంస్థ దేశ అవసరాలకు బొగ్గు ఉత్పత్తి చేస్తూనే హరితహారంలోనూ ముందంజలో ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 4.6 కోట్ల మొక్కలు నాటింది. ఈ ఏడాది 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. సీఎం కేసీఆర్ పిలుపును అందుకుని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఈ మేరకు ప్రణాళికలు రూపొందించారు. గత నెల 24న నిర్వహించిన వృక్షోత్సవంలో ఒక్కరోజే 5 లక్షల మొక్కలు నాటి సంస్థ రికార్డు నెలకొల్పింది. ఈ నెల 19న జరిగిన వృక్షారోహణ్ అభియాన్లో 11 ఏరియాల పరిధిలో 2.25 లక్షల మొక్కలు నాటింది. చిట్టడవులకు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని మొక్కలు పెంచుతున్నది.
11 ఏరియాల్లో నాటిన మొక్కలు..
2015లో 848.5 హెక్టార్లలో 40,07,955 మొక్కలు, 2016లో 819 హెక్టార్ల విస్తీర్ణంలో 1,00,37,896 మొక్కలు, 2017లో 811 హెక్టార్లలో 1,01,27,811 మొక్కలు, 2018లో 588 హెక్టార్లలో 90,31,452 మొక్కలు, 2019లో 652 హెక్టార్లలో 81,36,711 మొక్కలు, 2020లో 809 హెక్టార్లలో 46,31,674 మొక్కలు, 2021లో 911 హెక్టార్లలో మొత్తం 50,55,000 మొక్కలు నాటాల్సి ఉండగా లక్ష్యాన్ని అధిగమించేందుకు సంస్థ కృషి చేస్తున్నది.
పక్కాగా నర్సీల నిర్వహణ
ఏటా మొక్కలు నాటేందుకు సంస్థ 11 ఏరియాల్లో నర్సరీలు ఏర్పాటు చేసింది. కొత్తగూడెం కార్పొరేట్ సెంట్రల్ నర్సరీలో 7.15 లక్షల మొక్కలు, కొత్తగూడెం ఏరియా జీకేవోసీ నర్సరీలో 2.08 లక్షలు, సత్తుపల్లిలో 2.70 లక్షల మొక్కలు, ఇల్లెందు నర్సరీలో 2.36 లక్షల మొక్కలు, మణుగూరు నర్సరీలో 4.25 లక్షల మొక్కలు, రామగుండం1 ఏరియాలో 6.28 లక్షల మొక్కలు, రామగుండం-2 ఏరియాలో 1.98 లక్షల మొక్కలు, రామగుండం-3 ఏరియాలో 4.71 లక్షల మొక్కలు, భూపాలపల్లి ఏరియాలో 5.25 లక్షల మొక్కలు, శ్రీరాంపూర్ ఏరియాలో 8.48 లక్షల మొక్కలు, మందమర్రి ఏరియాలో 4.16 లక్షల మొక్కలు, బెల్లంపల్లిలో 5.39 లక్షల మొక్కలు కలిపి మొత్తం 50.55 లక్షల మొక్కలు నర్సరీల్లో పెంచి నాటిస్తున్నది.
హరితహారంలో ముందంజ..
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో సీఎండీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు హరితహారంలో అన్ని సంస్థల కంటే సింగరేణి సంస్థ ముందంజలో ఉన్నది. ఇప్పటివరకు సింగరేణి 4.5 కోట్ల మొక్కలు నాటింది. ఈ ఏడాది 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం., ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటాం.
-ఎన్.బలరాం, డైరెక్టర్ (పా)