Sompalli | బూర్గంపహాడ్ : బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా జీరో వ్యాపారం జరుగుతుందని బీసీ కాలనీకి చెందిన కొందరు యువకులు, గ్రామస్తులు ర్యాంపులో శనివారం రాత్రి ఇసుక లారీలను నిలిపివేసే ప్రయత్నం చేయగా ఆ సమయంలో రాంప్ నిర్వాహకులకు చెందిన కొందరు దాడి చేశారని, ఈ విషయంపై మాట్లాడేందుకు గ్రామస్తులు ఆదివారం కూడా ర్యాంపు వద్దకు వెళ్లినట్లు తెలిసింది.
ర్యాంపు వద్ద స్థానికులపై నిర్వాహకులు దాడిచేసిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆదివారం బ్లూకోట్ కానిస్టేబుల్, హోంగార్డు విచారణకు వచ్చి విచారణ అనంతరం తిరిగి వెళుతుండగా ఇసుకలారీ పోలీసు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలుకావడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇసుక ర్యాంపుల నిర్వాహకులు చేసేది అక్రమ వ్యాపారమైనా ఇలా ప్రశ్నించిన, అడ్డుకున్న వారిపై దాడులు చేయించడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు.
పోలీసులకే రక్షణ కరువైందా…?
అసాంఘీక శక్తులను అణిచివేసే రక్షకభటులకే రక్షణ కరువైందా..? అనే అనుమానం తాజాగా బూర్గంపహాడ్ మండలం సోంపల్లి వద్ద జరిగిన సంఘటనతో రుజువైంది. సోంపల్లి ర్యాంపు వద్ద లారీలను స్థానికులు అడ్డుకుంటున్నారన్నారన్న సమాచారం రావడంతో బ్లూకోట్ కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకున్నారు. సమస్యను పరిష్కరించి అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా సమర్థవంతంగా వ్యవహరించి తిరిగి వస్తుండగా లారీ వెనుక నుంచి పోలీసు వాహనాన్ని ఢీకొట్టడంతో వారు ప్రమాదానికి గురై భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు చెప్పడం వెనుక ఇసుక ర్యాంపు నిర్వాహకుల దాడులు ఏ విధంగా ఉన్నాయో తేటతెల్లమవుతోంది.
బూర్గంపహాడ్ మండలంలో ఇలాంటి మసలు ఇప్పటికే పలుమార్లు చోటుచేసుకున్నాయని ఇసుక అక్రమార్కులు ఆక్రమ రవాణా అడ్డుకునే, ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం కొత్తకాదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
లారీ కానిస్టేబుళ్ల బైక్ను ఢీకొట్టింది నిజమే.. : ఎస్సై ప్రసాద్
బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద స్థానికులు లారీలను అడ్డుకుంటున్నారని సమాచారం రావడంతో బ్లూకోట్ సిబ్బంది మంగీలాల్, శ్రీనివాసరావులు అక్కడకు వెళ్లి గ్రామస్తులకు సర్థి చెప్పి పంపించారని ఎస్సై మేడా ప్రసాద్ స్పష్టం చేశారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై తిరిగి దోమలవాగు నుంచి బయటకు వస్తున్న క్రమంలో లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపి ముందున్న బ్లూకోట్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మంగీలాల్, హోంగార్డు శ్రీనివాసరావుకు గాయాలుకావడంతో పాటు ద్విచక్రవాహనం, రెండు ట్యాబ్లు ధ్వంసమైనట్లు ఎస్పై తెలిపారు. గాయపడిన వారిని భద్రాచలం ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.