ఖమ్మం సిటీ, నవంబర్ 1: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల క్రీడాకారులకు అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలు శనివారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు కేయూ పీజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రవికుమార్ తెలిపారు.
నగరంలోని కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్న పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని డిగ్రీ, పీజీ, ఫార్మసీ తదితర కళాశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.
పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించనున్న పోటీల్లో 21 టీంల నుంచి 200 మంది హాజరుకాన్నుట్లు పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కే ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి, కేయూ క్యాంపస్ క్రీడా కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాదరావు, జిల్లా క్రీడాధికారి సునీల్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. అధ్యాపకులు కే ప్రసాదరావు, పీ కోటి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.