అశ్వారావుపేట, నవంబర్ 12: ఏళ్ల తరబడి కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దుమ్ము ధూళితో నానా అవస్థలు పడుతున్నామని అశ్వారావుపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అశ్వారావుపేటలో జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో చేపట్టారు. అధికారులు, కాంట్రాక్టర్ తీరును నిరసించడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఖమ్మం – జంగారెడ్డిగూడెం రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై అఖిల తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు పలువురు మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనులతో దుమ్ము ధూళి లేవడం వల్ల రోగాల భారినపడుతున్నామని, నిత్యం వాహనాల రాకపోకలతో రోడ్డుపై ఉన్న కంకర రాళ్లు తగిలి దుకాణాల్లోని షోకేస్ అద్దాలు సైతం పగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులకు పోలీసులు ఎంత నచ్చజెప్పినా అంగీకరించలేదు. రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో కాంట్రాక్టర్, అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. దీంతో ఎస్సై అఖిల.. ఆర్అండ్బీ డీఈ ప్రకాశ్‌తో ఫోన్లో మాట్లాడారు. మరో మూడు రోజుల్లో తారు నిర్మాణం పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.