మధిర, నవంబర్ 24: మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మధర పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. 2024లో సహజ మరణం పొందిన ఓ భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి న్యాచురల్ డెత్ బెనిఫిట్ స్కీం కింద ప్రభుత్వం రూ.1.30 లక్షలు మంజూరు చేసింది.
అయితే, ఈ పరిహారపు క్లెయిమ్‌ను పరిశీలించి మంజూరు చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్నె చందర్ కార్మికుడి భార్య నుంచి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇవ్వలేనని చెప్పి రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత ఖమ్మంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించి పరిస్థితిని వివరించింది. వారు పన్నిన పథకం ప్రకారం మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ టీ స్టాల్లో చందర్‌కు రూ.15 వేలు ఇస్తుండగా.. అక్కడే మాటు వేసిన అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.