అశ్వారావుపేట, జూన్ 24 : రాష్ట్ర ప్రజలకు అండగా ఉందామని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ శ్రేణులకు కూడా భరోసాగా నిలుద్దామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. అదే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎండగడదామని అన్నారు. కాంగ్రెస్ కూడా అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని, కేవలం అధికారం కోసం ప్రజలను మోసం చేసిందని స్పష్టం చేశారు. అధికారం లేకున్నా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని అన్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత వ్యవసాయక్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. స్వరాష్ట్ర అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమనే నమ్మకం ఎక్కువమంది ప్రజల్లో కన్పిస్తోందని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధించిన ప్రగతి, దాని ఫలాల గురించి మెచ్చాను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అయితే కేసీఆర్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి కేసీఆర్కు మెచ్చా వివరించారు. అయితే, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో నష్టం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నట్లు ‘మెచ్చా’ నమస్తే తెలంగాణకు తెలిపారు.