అశ్వారావుపేట రూరల్, మే 17: సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా మూడో రోజైన బుధవారం నారంవారిగూడెం, నారంవారిగూడెం కాలనీ, మొద్దులగూడెం, అల్లిగూడెం, గుర్రాలచెరువు, పేరాయిగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో రూ.82 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పల్లెలోనూ సీసీ రోడ్లు నిర్మించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కాగా, ఆయా గ్రామాల్లో ప్రజలు తమ కాలనీల్లోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వాటి పరిష్కారం కోసం అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
సీసీ రోడ్ల ప్రారంభోత్సవాల కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మూడో రోజూ పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన కొనసాగింది. మొద్దులగూడెం పర్యటిస్తుండగా అక్కడి ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ స్తంభాలు కావాలని, డ్రైనేజీ లేక వరదనీరు ఇళ్లలోకి వస్తోందని వివరించారు. అంగన్వాడీ వద్ద పెద్ద గుంతను తీసి పూడ్చకపోవడంతో గతంలో ఒక పాప అందులో పడి మృతిచెందిందని చెప్పారు. నారంవారిగూడెంలో గ్రామస్తులు డ్రైనేజీ సమస్యపై విన్నవించగా త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నారంవారిగూడెం కాలనీ ప్రజలు మాట్లాడుతూ.. తాము నివాసం ఉంటున్న ఇళ్లకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నామని, పట్టాలు ఇప్పించాలని వేడుకున్నారు. అనంతరం నారంవారిగూడెం – గుర్రాలచెరువు మధ్య నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాత అల్లిగూడెంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్యను గ్రామస్తులు తెలుపగా.. అక్కడే విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. అనంతరం గుర్రాలచెరువులో సీసీ రహదారిని ప్రారంభించారు. అయితే మరో సీసీ రోడ్డును మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. ఆయా గ్రామాల్లో ప్రజలు విన్నవించిన సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించినందుకు ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు మోహన్‌రెడ్డి, సంపూర్ణ, కలపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.