ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 25 : ప్రతి ఏడాదిలాగే మున్నేటి నది ఒడ్డున ఉన్న గంగామాతకు గంగపుత్రులు బోనమెత్తారు. శ్రావణమాసం మూడో ఆదివారం గంగపుత్రుల సంఘం జూబ్లీపుర, సారధినగర్ వారి ఆధ్వర్యంలో మహిళలు భారీసంఖ్యలో అమ్మవారికి మొకులు చెల్లించారు. మేళతాళాలు, డప్పుచప్పులు, పోతురాజుల విన్యాసాలతో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వీధివీధినా తిరుగుతూ వెళ్లి
అమ్మవారికి బోనాలు సమర్పించారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు కన్నం ప్రసన్నకృష్ణ, వంగాల వెంకట్ మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ భక్తులందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నం వైష్ణవి, సంఘ కార్యదర్శి కన్నం రమేష్, నాయకులు చేతి కృష్ణ, గోధుమల శ్రీనివాసరావు, సోమనబోయిన కుమారస్వామి, అంబటి రఘుబాబు, వడ్డెబోయిన భిక్షపతి, పిల్లి ఐలేష్, చేతి శ్రీనివాస్, బయన్న, నరసింహస్వామి, ఆనంద్, నవీన్, బలరాం, శంకర్, రవి, వీరాస్వామి, చిరంజీవి, సతీష్, రాజు, సందీప్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
రఘునాథపాలెం, ఆగస్టు 25 : ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో శ్రామణమాసం బోనాల సందడి ఆదివారం సంబురంగా జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల్లో ముత్యాలమ్మ జాతర పండుగను జరుపుకున్నారు. ఇంటింటికీ మామిడి తోరణాలను కట్టి అందంగా అలంకరించుకున్నారు. గ్రామాల్లో ప్రజలంతా కలిసి ఒకేసారి ముత్యాలమ్మ పండుగను నిర్వహించడంతో సందడి కనిపించింది. మహిళలు ఉదయాన్నే ఇళ్లల్లో ప్రత్యేక పూజలు చేసి ముత్యాలమ్మ తల్లికి నైవేద్యాన్ని వండి బోనం తలపై పెట్టుకొని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా బయలెల్లారు. గ్రామాల్లోని బొడ్రాయికి నీళ్లు పోసి పూజలు చేశారు. ఊరేగింపుగా వెళ్లి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
చింతకాని, ఆగస్టు 25: మండలంలోని లచ్చగూడెం గ్రామంలో గ్రామ దేవతలైన బోడ్రాయి, ముత్యాలమ్మ తల్లికి భక్తులు పూజలు చేసి బోనాలు సమర్పించారు. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి సామూహిక బోనాలతో తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, సొసైటీ డైరెక్టర్ తాతా ప్రసాద్, మాజీసర్పంచ్ గురజాల ఝాన్సీ, నాయకులు గురజాల కృష్ణ, కొప్పుల గోవిందరావు, సైదేశ్వరరావు, గోడుగు రమేశ్, భక్తులు, పాల్గొన్నారు.
ముదిగొండ, ఆగస్టు 25: శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని పల్లెల్లో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. డప్పువాయిద్యాలు, డీజే, పోతురాజుల విన్యాసాలతో పల్లెలు పండుగ శోభను సంతరించుకున్నాయి. మహిళలు బోనమెత్తి ఊరి శివార్లోని గ్రామ దేవతల వరకూ వెళ్లి బోనాలు సమర్పించి అమ్మలకు మొక్కులు చెల్లించారు.
తిరుమలాయపాలెం, ఆగస్టు 25: తిరుమలాయపాలెంలో ఆదివారం గ్రామ దేవత ముత్యాలమ్మ బోనాల పండుగను గ్రామస్తులు జరుపుకున్నారు. మహిళలు డప్పువాయిద్యాలతో బోనాలు తీసుకెళ్లి ముత్యాలమ్మ తల్లికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలను చల్లగా చూడాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నారు.
ఎర్రుపాలెం, ఆగస్టు 25: మండలంలోని జమలాపురం గ్రామంలో గ్రామస్తులు ముత్యాలమ్మ గ్రామదేవతకు ఆదివారం బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఇళ్ల నుంచి బోనాలు ఎత్తుకొని మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త తుళ్లూరి కోటేశ్వరరావు, నిర్మలకుమారి దంపతులు, మూల్పూరి శ్రీనివాసరావు, ఎల్వీ నారాయణరెడ్డి, వేమిరెడ్డి అంకిరెడ్డి, గొల్లపూడి వెంకటేశ్వరరావు, సుకవాసి రమేష్, అంకసాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.