ఖమ్మం, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా గొంటిమల్ల సాయికుమార్, కాటేపల్లి శైలజ నామినేషన్ దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పసుపులేటి శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థిగా బుడగ జంగం సాయిలు నామినేషన్ వేశారు. వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఒక్క నామినేషను కూడా దాఖలు కాలేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా శ్రీమండి ఉదయ్‌కుమార్, గుండపునేని సతీశ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇల్లెందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పాలెబోయిన రవికుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఒక్క నామిషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ ప్రక్రియ ఈనెల 10 వరకు కొనసాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు ఆయా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల్లో సంప్రదించవచ్చు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో కొందరు అభ్యర్థులు మంచిరోజు, ముహూర్తాలు చూస్తుండగా మరికొందరు పేరు బలం, సెంటిమెంట్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.