మట్టిబొమ్మకు జీవం ఊది మనిషిని చేసినవాడు బ్రహ్మయ్య. కుంచెతో బొమ్మను గీసి ప్రాణం పోసేవాడు చిత్రకారుడు. చిత్రకళ నేటికీ ఆశ్చర్యమే. ఏదో కొందిమందికే అది సొంతం. ఎన్నో అద్భుతాలు సృష్టించిన చిత్రకారుల జీవితం నేడు కొత్తపుంతలు తొక్కుతున్నది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగేసరికి చిత్రాన్ని కంప్యూటర్లో క్షణాల్లో వేసేస్తున్నారు. దీంతో చిత్రకళ చిన్నబోతున్నది. చిత్రకారులకు పని దొరకడం కష్టంగా మారింది. అయితే తెలంగాణ సర్కారు వచ్చాక వారికి ఊరట కలిగింది. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగంగా వారికి పని కల్పిస్తున్నది. గోడలపై బొమ్మలు, రైతువేదికలపై ప్రచార హోర్డింగ్‌లు, డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై రాతలతో భరోసా కల్పిస్తున్నది. ప్రజలందరూ చిత్రకళను ఆదరించి కాపాడాలని చిత్రకారులు వేడుకుంటున్నారు. వారి జీవితాల్లో వెలుగులు రావాలని ప్రతిఒక్కరం ఆశిద్దాం..
– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 4 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : రాజరికం ఉట్టిపడేలా.. దరహాసం మురిపించేలా ఊహలు, బొమ్మలతో చిత్రకారులు ఎన్నో అందాలకు ప్రాణం పోశారు. దేవతామూర్తుల చిత్రాలు వేసి, వాటికి సజీవ సాక్షాలుగా నిలిచిన చిత్రకారుల జీవితం రాళ్లపై చిత్రాలు చెక్కడానికి పరిమితమైంది. చెదిరిపోయిన రంగుల కళ కలగానే మారింది. ఫ్లెక్సీ ప్రపంచంలో వారి కుంచె కుచించుకుపోయింది. రంగుల కళ వారి ఆశలను చెల్లాచెదురు చేసింది. కుంచెను నమ్ముకున్న వారి ముఖాల్లో వెలుగురేఖలు కనబడటం లేదు. తెలంగాణ సర్కారు వచ్చాక కుంచెను నమ్ముకున్న వారికి చేయూతనిచ్చేందుకు అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఆర్టిస్టులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి గోడలపై బొమ్మలు, రైతువేదికలపై ప్రచార హోర్డింగ్‌లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై రాతలను వారికి ఇచ్చి వారి జీవనానికి భరోసా కల్పిస్తున్నది.
కుంచె కనుమరుగు
ఒకప్పుడు రంగుల ప్రపంచాన్ని శాసించిన చిత్రకారుల బతుకుపై ఫ్లెక్సీ టెక్నాలజీ అధిక ప్రభావం చూపింది. రంగులనే నమ్ముకున్న వారి జీవితాలు కనుమరుగవుతున్నాయి. నాడు వందల సంఖ్యలో ఉన్న ఆర్టిస్టులు నేడు పదుల సంఖ్యకే పరిమితమయ్యారు. అప్పుడు జిల్లాలో 600 కుటుంబాలు ఉండగా.. ప్రస్తుతం వారి జీవితం దుర్భరంగా ఉంది. అంతరించిపోతున్న చేతివృత్తులు వారికి ఉపాధి కల్పించినా ఆ పనిని నేర్చుకునే వారు కరవయ్యారు. నేటి పోటీ ప్రపంచంలో నిలబడిన కళాకారులు కేవలం 200మంది మాత్రమే మిగిలారు. కెమికల్ ఫ్లెక్సీలు వద్దనుకునే వారు. పర్యావరణ పరిరక్షణను కాపాడేవారు రంగులతో పనులు చేయించుకుంటున్నారు.
చెదిరిన రంగుల కళ
రంగులతో అందాలను సృష్టించిన ఆర్టిస్టుల కళ చెదిరిపోయింది. పర్యావరణానికి హాని కలిగించే సిరమిక్స్ ఫ్లెక్సీ రంగుల సమాజంలో చెలామణి అవుతున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం పెరిగే సరికి ఆర్టిస్టుల స్థానంలో ఫ్లెక్సీ మిషనరీలు ఆవిర్భవించాయి. గంటలో వేసే బొమ్మను సెకండ్లలో కంప్యూటర్ నుంచి ప్రింట్ బయటకు రావడంతో రంగుల ప్రపంచానికి తెరపడిపోతుంది. వయస్సు పెద్దగా ఉన్నవాళ్లు ఇండ్ల వద్దే తలుపులకు రంగులు వేసుకుని బతుకు ఈడుస్తుండగా.. ఆర్థికంగా నిలదొక్కుకున్న చిత్రకారులు మాత్రం పోటీ ప్రపంచంలో మేము సైతం అంటూ రాళ్లపై పేర్లు చెక్కుకుంటూ బతికేస్తున్నారు.
కుంచెలే వారి ప్రాణం
కుంచెను వారు ప్రాణంగా చూసుకుంటారు. కుంచె పట్టుకుంటే చాలు సెకన్లలో బొమ్మను గీసి చూపెడతారు. ఆ బొమ్మకు ప్రాణం పోసినట్టుంటుంది. నిజంగా బొమ్మనా ప్రాణం ఉన్న మనిషేనా అనిపిస్తుంది. నాడు రాజుల కుటుంబంలో మహారాణుల బొమ్మలు అందంగా గీసి రాజులతో శభాష్ అనిపించుకునే వారు నాటి చిత్రకారులు. కోటలో దొంగలు పడితే చిత్రకారుడికి ఆనవాళ్లు చెబితే దొంగ ఊహాచిత్రాన్ని గీసి రాజుకు ఇచ్చేవారు. అంతటి నైపుణ్యం ఉన్న చిత్రకారులు నేడు బొమ్మలు గీసే చేతివృత్తికి దూరం అవుతున్నారు. నాడు రంగుడబ్బా, కుంచె పట్టుకుంటే చాలు కుటుంబాన్ని పోషించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు.
ఎవరి దారి వారే..
నాడు కలిసికట్టుగా ఉన్న ఆర్టిస్టులు నేడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. షాపులను మూసి వేసి ఇంటికే పరిమితమవుతున్నారు. ఎక్కడ బొమ్మలు వేసే పని దొరుకుందా అని వెతుక్కుంటున్నారు. డబ్బులు ఉన్న వారు ఫ్లెక్సీ ప్రపంచంలో మునిగిపోగా లేనివాళ్లు కుంచెనే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసేందుకు జాతీయ రహదారి వెంబడి గోడలపై మిషన్ భగీరథ, పర్యాటక రంగం విశిష్టత, రామాలయం దృశ్య కావ్యాలు, రైతువేదికల వద్ద చిత్రాలను వేసే పనులు కల్పిస్తున్నారు. ప్రారంభోత్సవాలకు వేసే శిలాఫలకాలు కూడా ప్రస్తుత చిత్రకారులు చెక్కుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కొంతవరకు ఆదరణ కలుగుతున్నది.
కళకు ప్రాణం పోశాం..
కళను కళగానే చూస్తే ఆర్టిస్టు గొప్పతనం కనబడుతుంది. ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చే సరికి గ్రాఫిక్స్ చిత్రాలు తెరపైకి వచ్చేశాయి. దీంతో ఎన్నోరకాల బొమ్మలను ఫ్లెక్సీల ద్వారా వేయించుకుని ఉపయోగించుకుంటున్నారు. అది వారి ప్రతిభ కాదు. కుంచెతో వేసిన కళాకారుడి ప్రతిభనే గొప్పది. సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ కళా నైపుణ్యం చూడాలి. నిజంగా ఇది బొమ్మేనా అనేలా చిత్రాన్ని గీస్తున్నాము. ప్రతి ఒక్కరి బొమ్మను అచ్చుగుద్దినట్టు వేయగలుగుతాము. టెక్నాలజీ పెరిగాక ఫ్లెక్సీలు వచ్చాయి. కానీ మేము మాత్రం చేతివృత్తిని మానుకోలేక ఈ రంగంలోనే ఉంటున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించాలి.
– వెంకట్, ఆర్టిస్టు, కొత్తగూడెం
ఆదరణ బాగా తగ్గిపోయింది
రంగుల కళాకారులకు ఆదరణ బాగా తగ్గింది. చిత్రాలు వేయించుకునే వారు తగ్గారు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో రంగుల బొమ్మలకు ప్రాధాన్యత ఇస్తలేరు. ప్రముఖులు వచ్చేది కూడా కొన్ని గంటల ముందే చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫ్లెక్సీలకే అలవాటుపడ్డారు. కెమికల్స్ వాడకూడదు అన్నా.. వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. మాకు మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నాం.
– డేవిడ్, ఆర్టిస్టు, కొత్తగూడెం
రాళ్లపై పేర్లు చెక్కడం నేర్చుకున్నాం
బొమ్మలు గీయడం తగ్గాక రాళ్లపై పేర్లు చెక్కడం నేర్చుకున్నాం. పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంది. అయినా ఏదో ఒక పనిని చూసుకుని జీవనం సాగిస్తున్నాం. రంగుల బొమ్మలకు కెమికల్స్‌తో వేసిన వాటికి చాలా తేడా ఉంటాయి. అది అందరూ గమనిస్తే చాలు.
– యాకూబ్ యాడ్స్, కొత్తగూడెం