పాల్వంచ/ మధిర, ఏప్రిల్ 10: విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్ఈబీ రూల్స్ ప్రకారం పర్మినెంట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. అన్ని యూనిట్ల ఆర్టిజన్లు విధులను బహిష్కరించి పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో సమ్మెలో పాల్గొన్నారు.
టీజీ జెన్కో యాజమాన్యం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వాటిని లెక్కచేయకుండా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్లు కదం తొక్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆర్టిజన్లందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని కార్మికులు గుర్తుచేశారు. ఆ హామీ ప్రకారం ఇప్పుడు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు బీఆర్ఎస్, సీపీఐ కార్పొరేటర్లు, నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. ఆర్టిజన్లు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. కార్మికుల సమస్యలు పరిష్కరించుకుండానే విధుల్లో చేరాలని నోటీసులు జారీ చేయడం బాధాకరమని అన్నారు. అదే విధంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, మేయర్ మూడ్ గణేశ్ కూడా సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. వివిధ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, ఆర్టిజన్లు పాల్గొన్నారు.
తమ సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు, అన్-మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు మధిర డివిజన్లో చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. మధిర డివిజన్ పరిధిలోని కార్మికులు శుక్రవారం కూడా విధులను బహిషరించారు. డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో నిరసనను కొనసాగించారు. సమస్యలు పరిషారమయ్యే వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలోని ప్రధాన కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి.
ఒకే విద్యుత్ సంస్థ అయినప్పటికీ రెగ్యులర్, ఆర్టిజన్ ఉద్యోగులకు వేర్వేరు నిబంధనలు అమలు చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. అలాగే మరికొన్ని ఇతర ప్రయోజనాలను కోల్పోతున్నాం. కచ్చితంగా విద్యార్హతను బట్టి కన్వర్షన్ అమలు చేయాలి. ప్రత్యేక సర్వీస్ రూల్స్ అమలు చేయడం సరికాదు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లను పరిగణనలోకి తీసుకోవాలి.
– వలీ పాషా, అర్టిజన్ ఉద్యోగి, అశ్వారావుపేట
సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తాం. ఒక సంస్థ రెండు విధాలుగా సర్వీస్ రూల్స్ అమలు చేయడం హాస్యాస్పదం. సంస్థ వైఖరితో ఆర్టిజన్, అన్మ్యాన్డ్ వర్కర్లు కొన్నిరకాల ప్రయోజనాలు కోల్పోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. జెన్కో ఇప్పటికే నోటీసులు జారీ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నది. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను కూడా నిలిపివేసింది.
– కూనురాజు శ్రీనివాస్, జేఏసీ జిల్లా కన్వీనర్, కొత్తగూడెం
అపరిష్కృతంగా ఉన్న ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ వర్కర్ల సమస్యలు తక్షణం పరిష్కరించాల్సిందే. అంతవరకు ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వ వైఖరిని బట్టి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం, ఎన్పీడీసీఎల్ సంస్థలు వివక్ష చూపుతున్నాయి. హక్కుల కోసం సామరస్యంగా పోరాటం చేపట్టాం. అయినా మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేశారు. అందుకే జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నాం.
– షేక్ బషీరుద్దీన్, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం