ఖమ్మం, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. బీజేపీ సర్కార్ తెలంగాణపై వివక్ష చూపడంతోపాటు రైతులకు తీరని అన్యాయం చేస్తుండడంతో ఉద్యమబాట పట్టారు. కేంద్రం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరు మార్గం వీడబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటి వరకు వడ్లు కొనాలని ఒత్తిడి పెంచిన టీఆర్ఎస్ శ్రేణులు ఇక ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఇప్పటికే పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలు సభ్యులు తీర్మానాలు చేసి ఆ పత్రాలను ప్రధాని మోదీకి పంపించారు.
అనంతరం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. అయినా కేంద్రం నిరంకుశ వైఖరి వీడకపోవడంతో గురువారం ఖమ్మం, భద్రాద్రి జిల్లా కేంద్రాల్లో కర్షకులు, టీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్షకు దిగనున్నారు. ఈ దీక్షకు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరా నుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం నగరంలో జరిగే దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిర్వహించే దీక్షలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఖమ్మం, భద్రాద్రి జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపులో భాగంగా ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రాల్లో భారీ జనసమీకరణ, రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేసేందుకు సమాయత్తమయ్యారు.
ఉమ్మడి జిల్లాల్లో నిరసన దీక్షలు పెద్ద ఎత్తున జరిగేలా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఆందోళన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఖమ్మంలోని ధర్నాచౌక్ వద్ద రైతు నిరసన దీక్ష చేపట్టానున్నారు.
టీఆర్ఎస్ ఖమ్మం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు నియోజకవర్గాల వారీగా జనసమీకరణపై దృష్టి సారించారు. నిరసన దీక్ష ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే కొత్తగూడెంలోని ధర్నాచౌక్ వద్ద జరిగే నిరసన దీక్షకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, రైతులు హాజరయ్యేలా చూడాలని పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆయా నియోజకవర్గాల నేతలకు సూచించారు.
ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఈ నిరసన దీక్షలో పాల్గొనేలా కార్యాచరణను రూపొందించారు. ఖమ్మం దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొననున్నారు. గురువారం ఖమ్మం దీక్ష అంశంపై బుధవారం ఖమ్మంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గస్థాయి టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశమై చర్చించారు.
వర్తక సంఘం సంపూర్ణ మద్దతు
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 6: తెలంగాణ రైతుల యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వర్తక సంఘం వ్యాపారులు, కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న.. వ్యాపారులు, కార్మికుల మధ్య బుధవారం జరిగిన సమావేశంలో వ్యాపారులు మాట్లాడారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకోసం టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధ్యక్షతన జరుగనున్న దీక్షలో పాల్గొంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్నాయన్నారు.
సిమెంట్, స్టీల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయన్నారు. నిరసనలో భాగంగా గురువారం పత్తి మార్కెట్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి దీక్షా స్థలానికి చేరుకోవాలని వ్యాపారులు, కార్మికులు నిర్ణయించారు. వైస్ చైర్మన్ కే.వెంకటేశ్వర్లు, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, కార్మిక సంఘం నాయకుడు నున్నా మాధవరావు, వ్యాపారులు మాటేటి నాగేశ్వరరావు, నల్లమల ఆనంద్, దేవత్ అనిల్, పత్తిపాక రమేశ్, మెంతుల శ్రీశైలం, దిరిశాల వెంకటేశ్వర్లు, గీతా వెంకన్న, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలి
ఖమ్మం, ఏప్రిల్ 6: తెలంగాణలో రైతులు పండించే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఖమ్మం ధర్నాచౌక్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఖమ్మం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో రైతులు, శ్రేణులు కదిలిరావాలని సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పిలుపునిచ్చారు. నగరంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఉదయం 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ ధర్నాచౌక్‌కు చేరుకోవాలని, మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కొనసాగుతుందని అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, చింతనిప్పు కృష్ణచైతన్య, ఖమర్, తాజుద్దీన్, పాల్వంచ కృష్ణ, నున్నా మాధవరావు, మేకల సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.