ఖమ్మం రూరల్, అక్టోబర్ 08 : స్థానిక సంస్థలు (ఎంపీటీసీ, జడ్పిటిసి) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఖమ్మం రూరల్ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేసి అందుకు అనుగుణంగా ఆయా కౌంటర్లకు రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందిని కేటాయించారు. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒక జడ్పిటిసి ఎన్నికకు సంబంధించి ఈ నెల 9న ఉదయం 10:30 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పూర్తిచేసి తుది జాబితా ప్రకటించనున్నారు.
14 ఎంపీటీసీల పరిధిలో మండలంలో మొత్తం 35,797 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 175 మంది కాగా మహిళా ఓటర్లు 18,640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలకు అనుగుణంగా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేకంగా నాలుగు గదులను కౌంటర్లుగా ఏర్పాటు చేయగా, జడ్పిటిసి నామినేషన్ల స్వీకరణకు మరో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. మొదటి కౌంటర్లో కామంచికల్, పడమటి తండా, పోలిశెట్టి గూడెం, మంగళ గూడెం ఉండగా కౌంటర్ నంబర్ 2లో గూడూరు పాడు, కాసిరాజు గూడెం, చింతపల్లి, వెంకటయ్య పాలెం వన్ ఎంపిటిసిల పరిధిలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అదేవిధంగా కౌంటర్ నంబర్ 3లో ఎంవి పాలెం టు గొల్లపాడు పోలేపల్లి కౌంటర్లను ఏర్పాటు చేయగా కౌంటర్ నంబర్ 4లో కొండాపురం, పొన్నెకల్లు, తల్లంపాడు ఎంపీటీసీలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారు. జడ్పిటిసి స్థానానికి సంబంధించి మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు ఆ గదిలో జడ్పిటిసి స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.