భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ):ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ఎత్తుకున్న తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. సర్కారే నిరుపేదల వైద్యానికి రూ.లక్షలు వెచ్చిస్తూ రోగి లక్షణంగా ఇంటికి చేరేలా చేస్తోంది. ప్రభుత్వ దవాఖానలతోపాటు ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం వైద్యం చేయించుకునే వెసులుబాటు రోగులకు కల్పించింది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితిని పెంచి పథకం పక్కదారి పట్టకుండా క్యూ ఆర్ కోడ్‌తో కార్డులు జారీ చేసేందుకు సన్నద్ధమైంది. గతంలో కొన్ని జబ్బులకే ఆరోగ్యశ్రీ పరిమితం కాగా.. ప్రస్తుతం 1,948 వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ఆరోగ్యశ్రీ పథకానికి కొత్త రూపు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ అనేక మార్పులు తీసుకొచ్చింది. నాడు కేవలం రూ.2 లక్షలుగానే ఉన్న ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితి ప్రసుత్తం రూ.5 లక్షలకు మరో ముందడుగు వేసింది. 2014 వరకు అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నప్పటికీ.. కేసీఆర్ సీఎం అయ్యాక తెల్లరేషన్ కార్డుదారులందరికీ వైద్య సేలందిస్తున్నారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ కార్డు వినియోగానికి సరైన నిబంధనలు విధించకపోవంతో కార్డులు అధిక శాతం దుర్వినియోగమయ్యేవి. ఇందుకు అడ్డుకట్ట వేస్తూ తాజాగా బీఆర్ఎస్ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. త్వరలో అందించనున్న ఆరోగ్యశ్రీ కార్డు ముందు భాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, లింగం, కార్డు నెంబర్ వంటి ప్రాథమిక వివరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ లోగో, ఆరోగ్యశ్రీ ట్రస్టు లోగో, సీఎం కేసీఆర్ ఫొటో ముద్రించనున్నారు. స్కాన్ చేస్తే సమగ్ర వివరాలు తెలిసేలా క్యూ ఆర్ కోడ్‌ను కూడా కార్డుపై ముద్రిస్తారు. కార్డు వెనుక భాగంలో ఆరోగ్యశ్రీ ఉపయోగాలు ఉండనున్నాయి.
1,948 వ్యాధులకు చికిత్స..
గతంలో కొన్ని జబ్బులకే పరిమితమైన ఆరోగ్యశ్రీని ఇప్పుడు 1,948 వ్యాధులకు పెంచారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భద్రాద్రి జిల్లాలోని పది ప్రభుత్వ ఆసుపత్రులు, ఐదు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో 33 మంది ఆరోగ్యమిత్రలు, ముగ్గురు టీం లీడర్లు ఉన్నారు. వీరంతా ఒక జిల్లా మేనేజర్ నేతృత్వంలో విధులు నిర్వహిస్తున్నారు. కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి వంటి ప్రధాన శస్త్రచికిత్సలను ఇప్పటికే చేస్తున్నారు. జిల్లాలో ఉన్న డయాలసిస్ కేంద్రాలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి.
ఫేస్ రికగ్నేషన్ విధానం అమలు..
ఆరోగ్యశ్రీ కార్డుల దుర్వినియోగం కాకుండా ఉండడంతోపాటు సత్వర సేవలు అందించేందుకు ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. నిమ్స్ స్పెషల్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు బయోమెట్రిక్ విధానంలో ఒక్కోసారి ఆరోగ్యశ్రీ రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నందున సత్వర సేవల కోసం ఈ ఫేస్ రికగ్నేజేషన్ ఉపయోగపడనుంది. అలాగే, తెలంగాణ వచ్చాక ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి కేవలం తెల్ల రేషన్ కార్డు ద్వారానే వైద్యసేవలు అందించారు. గతంలో కేవలం కొన్ని వ్యాధులకే పరిమితమైన సేవలను ఇప్పుడు అన్ని వ్యాధులకు వర్తించేలా నిర్ణయించారు.
ఏ వ్యాధికైనా ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలు..
ఆరోగ్యశ్రీ కింద గతంలో కేవలం కొన్ని వ్యాధులకే పరిమితి ఉండేది. తెలంగాణ వచ్చాక 1,948 వ్యాధులకు ప్రభుత్వం చికిత్సలు అందిస్తోంది. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు రిఫర్ చేస్తే హైదరాబాద్, వరంగల్ నగరాల్లోని ఆసుపత్రులకూ పంపించి వైద్యం చేయిస్తున్నాం. రోగికి ఆపరేషన్ ఆయ్యాక కూడా ఇంటికి వెళ్లి వాళ్లు మందులు వాడుతున్నారా? లేదా? అనే విషయాలను ఆరోగ్యమిత్రలు పరిశీలిస్తున్నారు.
-శ్రీనివాస్. ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్
ఐదు డయాలసిస్ కేంద్రాల్లోనూ సేవలు..
తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలో ఐదు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తోంది. గతంలో రోగులు మూత్రపిండాల సమస్య వస్తే హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అది చాలా ఖర్చుతో కూడుకున్నందున ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ సేవలు అందుతున్నాయి.
–డాక్టర్ రవిబాబు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త