మామిళ్లగూడెం, నవంబర్ 12 : జిల్లాలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల ప్రకారం.. నవంబర్ 17న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో, నవంబర్ 18న గ్రూప్ 3 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పక్కాగా జరగాలన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 27,984 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, వీరికి 87 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు.
కమిషన్ సూచనల మేరకు విజయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్బీఐటీ కళాశాల ప్రిన్సిపాళ్లను రీజినల్ కో ఆర్టినేటర్లుగా నియమించామని తెలిపారు. ప్రశ్నాపత్రాలు అన్నింటినీ ఓల్డ్ ట్రెజరీలో భద్రపరుస్తున్నామని, ప్రతి 3 నుంచి 5 పరీక్షా కేంద్రాలకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్కాడ్ ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో ఎం.రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, పరీక్షల కో-అర్టినేటర్లు, కలెక్టరేట్ ఏవో అరుణ తదితరులు పాల్గొన్నారు.