మామిళ్లగూడెం, జనవరి 7 : మార్కెట్లో మిర్చి కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మిర్చి సీజన్ కార్యకలాపాలు, హోంగార్డ్స్ కేటాయింపు, మిర్చి రేటు హెచ్చు తగ్గులు, ఫైరింజన్ ఏర్పాటు, యార్డులో సౌకర్యాలు తదితర అంశాలపై మిర్చి ట్రేడర్లు, కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం, పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రైతులు 59 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారని, లక్షా 18 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చనే అంచనా ఉందన్నారు. మిర్చి యార్డుకు ఖమ్మం జిల్లాతోపాటు సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి పంట విక్రయానికి వచ్చే అవకాశం ఉందన్నారు.
పంట విక్రయానికి తీసుకొచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, యార్డులో సీసీ కెమెరాలు, టాయిలెట్స్, బయోమెట్రిక్ సిస్టం, మిర్చి గ్రేడింగ్ యంత్రాల వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు. మిర్చి సీజన్లో మరో 20 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, భద్రత కోసం 20 మంది హోంగార్డులను కేటాయించాలని సూచించారు. మార్కెట్లో అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీం, ఏసీపీ యూఎస్.రాజు, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ షఫీవుల్లా, అగ్నిమాపక అధికారి అజయ్‌కుమార్, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, వ్యాపారులు పాల్గొన్నారు.