ఖమ్మం, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ చారిత్రక ఘట్టంగా నిలిచిపోయేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం సమీపంలోని నూతన సమీకృత కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు వద్దిరజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి అజయ్ అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీల నేతలు ఒకే వేదికపై వచ్చి ప్రజలకు సందేశమిచ్చే మహోన్నత ఘట్టానికి ఈ ఖమ్మం సభ వేదిక కాబోతోందని అన్నారు. అశేషంగా వచ్చే జనప్రవాహానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఏర్పడిన తరువాత పార్టీ ఏర్పాటు చేసిన తొలిసభపై యావత్ దేశమూ దృష్టి సారించిందని అన్నారు.
అందుకని బీఆర్ఎస్ సత్తా ఏమిటో ఈ సభ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వావాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ.రాజా వంటి ప్రముఖులు ఈ సభలో పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచేగాక పొరుగున ఉన్న డోర్నకల్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు వివరించారు. సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, వేదిక ఏర్పాట్లను పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పర్యవేక్షిస్తారని అన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు నాంది కానుందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. జాతీయపార్టీగా ఆవిర్భావించాక బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఈ తొలి సభకు ఖమ్మం వేదిక కావడం జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తొలి సభకు ప్రతి వీధి నుంచి, ప్రతి గ్రామం నుంచి చీమలదండులా ప్రజలు తరలడానికి సన్నద్ధమవుతున్నారని అన్నారు.