ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 16: డీఎస్సీ-2024లో మంగళవారం అర్ధరాత్రి వరకు నియామక ఉత్తర్వులు అందుకున్న నూతన ఉపాధ్యాయులు బుధవారం జిల్లాలోని తమకు కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట్ చేశారు. 520 మంది వివిధ కేటగిరీలలో డీఎస్సీలో ఎంపిక కాగా.. వారిలో 516 మందికి మాత్రమే పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. 21 మండలాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లలో పలు కేటగిరీలలో రిపోర్ట్ చేస్తున్న ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలలకు చెందిన హెచ్ఎంలు, టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాదర స్వాగతం పలికారు.
జిల్లాలోని 520 మంది అభ్యర్థుల్లో 516 మందికి నియామక ఉత్తర్వులు ఇవ్వగా.. ముగ్గురి ఉత్తర్వులను పెండింగ్‌లో పెట్టారు. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు ఎంపికయ్యాడు. ఒకటి ప్రభుత్వ స్కూల్స్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, మరొకటి లోకల్‌బాడీలో స్కూల్ అసిస్టెంట్ గణితం ఉన్నాయి. ఈ రెండింట్లో ప్రభుత్వ పరిధిలోని స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్‌ను ఎంపిక చేసుకోవడంతో దానికి సంబంధించిన నియామక పత్రాన్ని అందించారు. మిగిలిన ముగ్గురిలో పలు సర్టిఫికెట్లను పరిశీలనకు అందజేయకపోవడంతో వారికి పోస్టింగ్స్ కల్పించలేదు. ఒక అభ్యర్థి డిగ్రీ సర్టిఫికెట్, మరో అభ్యర్థికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఇంకొకరికి బీసీ-సీలో సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు.
జిల్లాలో 516 మందికి ఉపాధ్యాయులుగా నియామక ఉత్తర్వులు అందించగా.. వారిలో 481 మంది తమకు కేటాయించిన పాఠశాలల్లో హెచ్ఎంలకు బుధవారం రిపోర్ట్ చేశారు. కొత్తగా విధుల్లో చేరేందుకు వచ్చిన టీచర్ల నుంచి నియామక ఉత్తర్వులతోపాటు జాయినింగ్ రిపోర్ట్‌ను తీసుకుని రిజిస్టర్లో పేరు నమోదు చేశారు. దీంతో అన్ని పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయుల రాకతో కోలాహలం నెలకొంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టీచర్లు స్వీట్లు అందజేయగా.. మిగిలిన ఉపాధ్యాయులు వారికి అభినందనలు తెలిపారు.
35 మంది ఉపాధ్యాయులు ఇంకా రిపోర్ట్ చేయాల్సి ఉంది. పాఠశాలల్లో రిపోర్ట్ చేసేందుకు ప్రభుత్వం 15 రోజుల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా మండలాల్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టీచర్లు అక్కడి ఎంఈఓవోలను కలిశారు. అత్యధికంగా ఖమ్మం అర్బన్ మండలంలో 44 మంది ఉపాధ్యాయులు బాధ్యతలు స్వీకరించినట్లు ఎంఈవో రాములు తెలిపారు. రిపోర్టింగ్ ప్రక్రియను డీఈవో సోమశేఖర శర్మ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. డీఎస్సీ-2024 ద్వారా కొత్త టీచర్లు రావడంతో అంతకుముందున్న డిప్యూటేషన్, బదిలీ ఉపాధ్యాయులను రిలీవ్ చేశారు.