దుమ్ముగూడెం, డిసెంబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం కొత్తదంతెనం పంచాయతీలోని సీతారాంపురంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా తెల్లం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పారదర్శకంగా పరిశీలించి అర్హులైన దరఖాస్తుదారులకు పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం అదే పంచాయతీలోని ఏకలవ్య పాఠశాల పనులను ఆయన పరిశీలించారు. పిల్లలతో కొద్దిసేపు మాట్లాడి మధ్యాహ్న భోజనానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామసభలో జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, దామెర్ల శ్రీనివాసరావు, మోతుకూరి శ్రీకాంత్, కొత్తా మల్లేశ్, పొడియం సుబ్బారావు, ఎస్కె.బాషా, బొల్లోజు రవి, పవన్, అజీమ్, ముత్యాలరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.