అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 3 : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలు అంటూ సొంత డబ్బా కొట్టుకోవడానికే నిర్వహిస్తున్నారని రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండున్నరేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను విస్మరించిందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దోచుకోవడం, జేబులు నింపుకోవడానికే రాష్ట్రంలోని మంత్రివర్గం పని చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆటలు ఆడటం, పాటలు పాడటం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ‘మెచ్చా’ చేపట్టిన అభివృద్ధి పనులను కూడా రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పూర్తి చేయలేదని, కనీసం ఆసుపత్రిలో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ఓటమిని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆయన పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉందని గుర్తు చేశారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది పాలేరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డేనని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి, బీఆర్ఎస్ నాయకులు జేకేవీ రమణారావు, జలిపల్లి శ్రీరామమూర్తి, డాక్టర్ భూక్యా ప్రసాదరావు, మందపాటి రాజమోహన్‌రెడ్డి, కాసాని నాగశేష పద్మ, కాసాని చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.