తిరుమలాయపాలెం, నవంబర్ 27: కాంగ్రెస్ నాయకుల వేధింపులు, పోలీసుల అక్రమ కేసులకు భయపడేది లేదని, పార్టీ కార్యకర్తలకు అధిష్టానం అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. తిరుమలాయపాలెంలో గురువారం పర్యటించిన ఆయన.. మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, వేధింపులకు తాళలేకి ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు ఆర్మీ (బానోతు) రవిని ఆయన తన స్వగ్రామంలో పరామర్శించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. తర్వాత జల్లేపల్లిలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీ అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, ఆర్మీ రవిపై మంత్రి పొంగులేటి అనుచరులు కక్షగట్టి, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం అన్యాయమన్నారు. కేసులు పెట్టినంత మాత్రాన కార్యకర్తలు భయపడొద్దని, పార్టీ అభివృద్ధి కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తిరిగి వివరించాలని కార్యకర్తలను కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, మాజీ సర్పంచ్ బాషబోయిన శైలజ, పోట్ల జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.