ఖమ్మం రూరల్, జూలై 6: అబద్ధాల పునాదులపైనే రేవంత్‌రెడ్డి పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, నాలుగు వందల అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారెంటీలను, 420 హామీలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిగణేశ్నగర్లో ఉన్న పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు, మంత్రులకు వేరే పనేమీ లేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రతి రోజూ తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హామీనీ పూర్తిగా నేరవేర్చలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడాన్ని, జైళ్లకు పంపడాన్నే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారంలో ఉండి ప్రతిపక్ష నేతలకు సవాల్ విసరడం సిగ్గుచేటని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రోజూ మాట్లాడే బూతులను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని అన్నారు.
తెలంగాణలో యూనివర్సిటీలకు, ఎయిర్‌పోర్టులకు, ప్రభుత్వ పథకాలకు గాంధీల పేర్లు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. వెంటనే ఆ పేర్లను తొలగించి తెలంగాణ కవులు, రచయితలు, మేధావుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. నాటి బీఆర్ఎస్ సర్కారు రైతులకు ఎలాంటి మేలు చేసిందో వివరించేందుకు కేటీఆర్ విసిరిన సవాల్‌ను సీఎం స్వీకరించి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. నాటి బీఆర్ఎస్ సర్కారు అనేక ఉద్యోగాలకు నోటిఫికేన్లు విడుదల చేసి ప్రక్రియను పూర్తి చేస్తే.. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ సర్కారు ఆ ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకొని పబ్బం గడుపుతోందని విమర్శించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అనేక పథకాలు, నిర్మాణాలు పల్లెపల్లెనా సజీవ సాక్షాలుగా ఉన్నాయని గుర్తుచేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతు పథకాలకు పాతర వేస్తున్న సీఎం రేవంత్‌కు రైతులు తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఈ జిల్లాలో చేసిన అభివృద్ధి శూన్యమని రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును 80 శాతానికి పైగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిచేశారని గుర్తుచేశారు. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ 20 శాతాన్ని కూడా పూర్తిచేసే సోయిలేదని విమర్శించారు. జిల్లా అభివృద్ధికి ఈ ముగ్గురు మంత్రులు చేసిన కృషి ఏమిటో చెప్పేందుకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. రైతుభరోసాకు ఎగనామం పెట్టిన, ఒరకొరగా రుణమాఫీని చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి అన్నదాతలు సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తేల్చిచెప్పారు.
అభినవ కర్ణుడి లాంటి కందాళ ఉపేందర్‌రెడ్డి పాలేరు ప్రజలు ఒదులుకోవడం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణు, బాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, గూడ సంజీవరెడ్డి, జర్పుల లక్ష్మణ్‌నాయక్, ముత్యం కృష్ణారావు, పేరం వెంకటేశ్వర్లు, అక్కినపల్లి వెంకన్న, మరికంటి రేణుబాబు, ఉపేందర్‌రెడ్డి, నాగేశ్వరారవు, మేకల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాకేశ్‌రెడ్డి సహా బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ నాయకులందరూ కలిసి ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల ఆలయానికి వెళ్లి అక్కడి సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం సమీపంలోని మున్నేరు, ఆకేరు వాగులను పరిశీలించారు.