అన్నపురెడ్డిపల్లి, జూన్ 26 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా రైతు పండుగ సంబురాలు చేసుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఏం సాధించి పెట్టారని సంబురాలు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు చేసుకొని రైతులు చనిపోయినందుకా.. రైతు భరోసాను ఎగ్గొట్టినందుకా.. రైతు బీమాను ఆపినందుకా.. సన్నవడ్లకు ఇస్తామన్నా బోనస్‌ను బోగస్ చేసినందుకా.. వీటన్నింటికీ రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
గురువారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చిందన్నారు. రైతులను రారాజులుగా చేయాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెడితే అది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనుడు కేసీఆర్ అని, ఆయనను విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో రెండుసార్లు రైతుబంధుకు ఎగనామం పెట్టారని, రూ.44 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.19 వేల కోట్లు చెల్లించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి.. రూ.46 వేల కోట్ల రుణమాఫీకి.. రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసి.. రూ.25 వేల కోట్లు ఎగనామం పెట్టిన ఘనత వారిదన్నారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పిన మాట బోగస్ అయ్యిందన్నారు. కేసీఆర్ ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో రూ.8,500 కోట్లతో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తే.. సాగునీటి కోసం చిన్న కాల్వలు నిర్మించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, దీనికి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో 18 నెలలుగా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
అనంతరం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలను సందర్శించిన ఆయన.. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు, మాజీ ఎంపీపీ సున్నం లలిత, నాయకులు మామిళ్లపల్లి రామారావు, జం గాల ఉమామహేశ్వరరావు, లక్ష్మణరావు, కొత్తూరు వెంకటేశ్వరరావు, భూపతి నరసింహారావు, వీరబోయిన వెంకటేశ్వర్లు, నర్సారెడ్డి, భారత రాంబాబు, కొండేటి నరసింహ, చల్లా రాంబాబు, పెద్దగౌండ్ల పుల్లారావు, వడ్డే సత్యం, ప్రకాశరావు, సుధాకర్, చిరంజీవి, మానికల రాంబాబు, రామచంద్రరావు, వెంకటేశ్వర్లు, అప్పారావు, భీముడు, జమలయ్య, వాడే రాంబాబు, కృష్ణ, శ్రీను పాల్గొన్నారు.