ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతున్నది. చివరికి అమలు చేయకుండానే చేతులెత్తేస్తున్నది. కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్నది. ఫలితంగా ఆశతో ఎదురుచూస్తున్న ప్రజలు, రైతులకు నిరాశే మిగులుతోంది. ఇందులో భాగంగానే సన్నరకం ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. యాసంగిలో ఏ ఒక్క రైతుకీ జమ చేయలేదు. కేవలం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర చెల్లించి తాత్కాలికంగా చేతులు దులుపుకుంది.
గత వానకాలం సీజన్లో సేకరించిన సన్నాలకు మూడు నెలల తర్వాతనే బోనస్ చెల్లించింది. అది కూడా రైతులందరికీ అందలేదు. ఈ యాసంగిలో విక్రయించిన సన్నాల బోనస్‌ను ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ‘అసలు ఇస్తుందా? లేదా?’ అనే సందేహాలు కూడా వెంటాడుతున్నాయి. ‘వానకాలం మాదిరిగానే బోనస్ చెల్లింపులో ఆలస్యం అవుతుందా?’ లేక ‘ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎత్తేస్తారా?’అనే ఆందోళనలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి.
– అశ్వారావుపేట, మే 18
పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని, అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. అన్నిరకాల పంట ఉత్పత్తులపై బోనస్ ఇస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. తర్వాత సన్నాలకు మాత్రమే వర్తిస్తుందని, దొడ్డు ధాన్యానికి ఇవ్వలేమని చేతులెత్తేశారు. కనీసం సన్నాలకైనా సక్రమంగా బోనస్ చెల్లిస్తున్నారా అంటే అదీలేదు. దొడ్డు రకం ధాన్యాన్ని పక్కనపెట్టి ముందుగా సన్నాలనే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది.
కేంద్రం ప్రకటించిన రూ.2,320 మద్దతు ధర కలిపి (క్వింటాకు) బోనస్ రూ.500 చెల్లించాల్సిన ప్రభుత్వం కేవలం మద్దతు ధర మాత్రమే రైతులకు చెల్లిస్తున్నది. సన్నాలకు రూ.500 బోనస్ వస్తుందని ఎక్కువమంది రైతులు సన్నాలనే పండించారు. కొనుగోలు కేంద్రాలకు సన్నాలను తీసుకొచ్చిన తర్వాత కొలతలు సేకరిస్తున్నారు. అనుకున్న దాని ప్రకారం ఉంటేనే సన్నాలుగా నిర్ధారించుకుని అధికారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడవరకు బాగానే ఉంది.
కొనుగోళ్లు పూర్తయిన తర్వాత దొడ్డు రకం ఇచ్చినట్లుగానే సన్నాలకు మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ.2,320 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. బోనస్ మాత్రం చెల్లించడం లేదు. గత వానకాలంలో కొనుగోలు చేసిన సన్నాలకు బోనస్‌ను మూడు నెలల తర్వాత ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరికొందరు రైతులకు అదీ కూడా అందలేదు.
ఈ సీజన్లోనైనా ప్రభుత్వం తాము పండించిన సన్నాలకు కనీస మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లిస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. సుమారుగా నెలన్నర నుంచి సన్నాలను కొనుగోలు చేస్తున్నది. మద్దతు ధరతోనే బోనస్ వస్తుందని ఆశించిన రైతులు భంగపడుతున్నారు. కేవలం మద్దతు ధరనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో రైతులు అవాక్కవుతున్నారు.
రూ.కోట్లలో బోనస్ పెండింగ్
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను మాత్రమే రైతు ఖాతాల్లో జమ చేస్తున్నది. అదనంగా ఇచ్చే బోనస్ రూ.500ను పెండింగ్‌లో పెడుతున్నది. ఇది కాస్తా రూ.కోట్లలో పేరుకుపోతున్నది. ఒక్క అశ్వారావుపేట నియోజకవర్గంలోనే సుమారు ఇప్పటివరకు 1,66,899 క్వింటాళ్ల సన్నాలను ప్రభుత్వం సేకరించింది. ఇందుకు చెల్లించాల్సిన బోనస్ రూ.8,34,49,500 వరకు పెండింగ్‌లో ఉంది. మరికొంత ధాన్యం సేకరించాల్సి ఉంది. దీంతో కలుపుకుంటే బోనస్ పెండింగ్ మరింత పెరిగిపోతుంది. ఇందులో ఏ ఒక్క రైతు ఖాతాలోనూ సన్నాల బోనస్ జమ కాలేదు.
స్పష్టత ఏదీ?
సన్నరకం ధాన్యానికి చెల్లించే బోనస్‌పై రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు సైతం అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. బోనస్ చెల్లింపులో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ తప్పించుకుంటున్నారు. రాష్ట్ర ఖాజానా సరిగా లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే పలుమార్లు ప్రకటించడంతో ‘అసలు బోనస్ ఇస్తుందా? లేదా?’ అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ఏ రోజుకారోజు సేకరించిన సన్నరకం ధాన్యంపై బోనస్ నివేదికలను ప్రభుత్వానికి అందిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. బోనస్ ఎప్పుడు విడుదల చేస్తారన్న ప్రశ్నకు వారి నుంచి సమాధానం రావడం లేదు.
బోనస్ అందలేదు..
ఈ యాసంగిలో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,320 చొప్పున ఖాతాలో జమ చేసింది. దీనికి బోనస్‌ను కలపలేదు. పెండింగ్‌లో ఉంచింది. గత వానకాలంలో మూడు నెలల తర్వాత బోనస్ చెల్లించింది. ఈ సీజన్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అసలు బోనస్‌ను ఇస్తారా? ఇవ్వరా? అనే స్పష్టత లేదు.
– చిలుకూరి రాంబాబు, రైతు, అశ్వారావుపేట