ఖమ్మం రూరల్, జనవరి 07 : మాజీ మంత్రి కేటీఆర్ వీరాభిమాని బానోతు అనిల్ నాయక్ ఎట్టకేలకు ఆయనను కలిశాడు. కొద్ది సంవత్సరాలుగా కేటీఆర్ అంటే పడిసచ్చే అభిమానిగా ఉన్న అనిల్ కేటీఆర్‌ను కలిసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయితే బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న కేటీఆర్‌ను కలిసి తన అభిమానాన్ని గొప్పగా చూపించాలనే ఉద్దేశంతో గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకుని తన రక్తంతో చిత్రాన్ని గీయించి ఫొటో ప్రేమ్ ను కేటీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనిల్ బుధవారం ఉదయం నుండి కేటీఆర్‌ని కలిసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట క్రాస్ రోడ్ వద్ద కలిసే అవకాశం ఉంటుందని భావించినా సమయాభావం వల్ల కేటీఆర్ అక్కడ ఆగక పోవడంతో నేరుగా ఖమ్మం వెళ్లి సర్పంచుల సన్మాన సభలో కేటీఆర్ పాల్గొన్న విషయం తెలుసుకుని గంటల తరబడి వేచి చూసి ఎట్టకేలకు కేటీఆర్‌ను కలిసి తన ప్రేమ అభిమానాలను పంచుకున్నాడు. హృదయంపై పచ్చబొట్టు చిత్రాన్ని చూపెడుతూ తన రక్తంతో వేసిన చిత్రాన్ని కేటీఆర్ కు అందజేశాడు. అనిల్ నాయక్ ప్రేమాభిమానాలకు మంత్రముగ్ధుడైన కేటీఆర్ కొద్దిసేపు అనిల్‌తో మాట్లాడారు. మరోసారి తప్పకుండా హైదరాబాద్‌లో కలుద్దామని అనిల్ చూపిన చొరవ పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.