భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు, చేపట్టాల్సిన చర్యలు, పిల్లల్లో పోషక లోపం నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ… పోషకలోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు దోహదపడే విధంగా పౌష్టికాహారం అందజేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోషకలోపం ఉన్న పిల్లలకు అదనంగా బాలామృతం అందిస్తున్నామని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సంక్షేమాధికారి విజేత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.