ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 17 : చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు బలమైన పునాదులుగా నిలుస్తున్నాయని ఖమ్మం రూరల్ సీడీపీఓ సీహెచ్ కమలప్రియ అన్నారు. ఆరేళ్ల లోపు చిన్నారుల సరైన ఎదుగుదలతో పాటు సృజనాత్మకత, సామాజిక వికాసాలను పెంపొందించే దిశగా ప్రారంభించిన ‘పోషణ్ బీ…పడాయి బీ’ కార్యక్రమంపై స్థానిక ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో బుధవారం ఆమె పాల్గొని మాట్లాడారు. స్త్రీ శిశు సంరక్షణ, మాతా శిశు మరణాల నివారణలో అంగన్వాడీ కేంద్రాల ఆవశ్యకతను వివరించారు. పోషకాహార లోపాన్ని నివారించడంలో, ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాలకు బాటలు వేయడంలో అంగన్వాడీ కేంద్రాలే కీలకమని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు పోషకాహార లోపాన్ని ప్రారంభంలోనే గుర్తించి సరైన చికిత్స, అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో శారీరక, మానసిక వికాసం పెంపొందించడం, ఆటపాటలతో కూడిన బోధన ద్వారా ఒత్తిడి లేని, సృజనాత్మకతతో కూడిన భోదన అందించడం జరుగుతుందన్నారు. చిన్నారుల్లో మరింత మానసిక వికాసం, తెలివితేటలు పెంపొందించే దిశంగా ప్రారంభించిన ‘పోషణ్ బీ…పడాయి బీ’ కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేలా అంగన్వాడీ టీచర్లంతా కృషి చేయాలని సూచించారు. శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న అంశాలను కేంద్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.