ఖమ్మం రూరల్, మార్చి 19 : ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తీర్థాల గ్రామం చిత్రవిచిత్రాలకు నెలవుగా తయారైంది. ఇప్పటికే గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో మిరపతోట సాగుచేసిన వైనం కొద్ది రోజుల క్రితం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన సంగతి తెలిసిందే. కాగా మరో ఉదాంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి ఏకంగా గ్రామ పంచాయతీ భవనంలో అంగన్వాడి కేంద్రం నిర్వహణ. గ్రామ పంచాయతీ భవనంలో వంట గది ఏర్పాటు చేసుకుని అంగన్వాడి సేవలు కొనసాగుతున్నాయి.
గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆకేరు, మున్నేరు నదులు పొంగి ప్రవహించడంతో గ్రామంలో అనేక ఇండ్లు నీటి మునిగాయి. దీంతో అంగన్వాడి భవనం సైతం స్వల్పంగా దెబ్బతింది. అప్పటినుంచి అటు పంచాయతీ సెక్రెటరీ, ఇటు అంగన్వాడి టీచర్లు పైఅధికారులకు సమస్య గురించి పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అంగన్వాడి సిబ్బంది గడచిన పది నెలలుగా ఈ చిన్నపాటి పంచాయతీ భవనంలోనే విద్యార్థులకు విద్యా, భోజనం అందిస్తున్నారు. ఒకవైపు పంచాయతీ సేవలు, మరోవైపు అంగన్వాడి నిర్వహణ ఇబ్బందిగా మారినట్లు వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే పంచాయతీ భవనంలో అంగన్వాడి కేంద్రం నిర్వహిస్తుండటం పట్ల పిల్లల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అంగన్వాడి సొంత భవనం పునరుద్ధరణ చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.