మిషన్ భగీరథ పథకం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. పైపులైన్ల లీకేజీలు, పగుళ్లు ఏర్పడినా పట్టించుకునే వారు లేకపోవడంతో కాలనీవాసులు మంచినీటికి అవస్థలు పడుతున్నారు. సన్నటి నీటి ధారతో బిందెలు పట్టుకొని గంటలకొద్దీ ఎదురుచూడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వరుసగా నాలుగైదు రోజులు నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మినరల్ వాటర్ కొనుక్కోవాల్సి వస్తున్నదని మండలంలోని 4 ఇైంక్లెన్ పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీవాసులు చెబుతున్నారు. వేసవి రాకముందు ఇన్ని ఇబ్బందులు ఉంటే.. మున్ముందు మా పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇంట్లో వాడుకోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి దాపురించిందని దిగులు పడుతున్నారు. -చుంచుపల్లి, మార్చి 26
ఇంటింటికీ శుద్ధ జలాలు అందించాలనే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసింది. పైపులైన్లు వేసి ఎలాంటి లోటు లేకుండా సమృద్ధిగా తాగునీరు అందించింది. కానీ.. 15 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మిషన్ భగీరథ పథకాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొన్నది. అక్కడక్కడా దెబ్బతిన్న పైపులైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ప్రజలు నీరందక తంటాలు పడుతున్నారు. అరకొరగా వచ్చే నీటి ధారతో గంటలకొద్దీ కుళాయిల వద్దే ఉండాల్సి వస్తున్నదని పలువురు మహిళలు వాపోతున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీ వాటర్ స్కీం నీరే మాకు దిక్కైంది అని చెబుతున్నారు. అది కూడా రెండు మూడు రోజులకొకసారి పైపులైన్లు లీక్ కావడంతో నీటి సమస్య తలెత్తుతుందని, అప్పుడు చుక్క నీరు కూడా రాదని అంటున్నారు. తాగునీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, పైపులైన్లు మరమ్మతు చేసి తాగునీరు అందేలా చూడాలని కోరుతున్నారు.
మంచినీళ్లు కొనుక్కుంటున్నాం..
గ్రామపంచాయతీ నల్లా నీరు అందరికీ సరిపోవడం లేదు. చేసేది లేక మినర్ వాటర్ కొనుగోలు చేసి తాగుతున్నాం. అది కూడా మరమ్మతులకు గురైతే ఎవరూ పట్టించుకోవడం లేదు. మేమే సొంతంగా డబ్బులు వేసుకొని మరమ్మతు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మిషన్ భగీరథ నీరు పుష్కలంగా వచ్చే విధంగా అధికారులు చూస్తే బాగుంటుంది. బోరు వాటర్ తాగలేకపోతున్నాం.
-గోడేటి రోహిణి, అంబేద్కర్ నగర్, చుంచుపల్లి
గంటలకొద్దీ పంపు వద్దే..
పైపులు లీకవుతుండడంతో నల్లా నీరు సరిగా రావడం లేదు. బిందెలోకి పైపు పెడితే సరిగ్గా నిండడం లేదు. గంటలకొద్దీ వేచి చూడాల్సి వస్తున్నది. మిషన్ భగీరథ పంపులు వస్తున్నాయా అంటే.. ఆ నీళ్లు రావడం లేదు. మినీ వాటర్ ట్యాంకులో నీళ్లున్నా మాకు సరఫరా కావడం లేదు. అధికారులను అడిగితే.. మీ ఏరియా ఎత్తులో ఉంది.. నీటి సరఫరా అంతంత మాత్రమే వస్తుందని చెప్పి దాటవేస్తున్నారు.
-సిరివేరి రాధ, అంబేద్కర్‌నగర్,4 ఇైంక్లెన్
నీటి సమస్యను పరిష్కరిస్తాం..
కాలనీ ఎత్తయిన ప్రదేశంలో ఉండడం వల్ల నీళ్లు సరిగా కుళాయిలకు అందడం లేదు. మూడు రోజుల నుంచి పైపుల లీకేజీ కారణంగా నీటి సరఫరా చేయలేకపోయాం. రెండు రోజులకొకసారి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
-వసంతకుమారి, మిషన్ భగీరథ ఏఈ, చుంచుపల్లి