ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 24: తమ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు చేస్తున్న సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. దీంతో తమ ఆందోళనను మరింత ఉధృతం చేసిన ఉద్యోగులు.. రోజుకో రీతిలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద చేపట్టిన ఆందోళనలో భాగంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూరగాయలు విక్రయిస్తూ నిరసన తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో మరికొంత వినూత్నంగా చేశారు. జిల్లా కేంద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో భద్రాచలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ మహార్యాలీ నిర్వహించారు. ఆ తరువాత గోదావరి వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. తరువాత అక్కడి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమను రెగ్యులరైజ్ చేసేలా ముఖ్యమంత్రిని కరుణించాలంటూ వేడుకున్నారు. తరువాత రామయ్య విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. మరణించిన ఎస్ఎస్ఏ ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం అందించేలా సీఎంను దీవించాలని కోరుకున్నారు.